ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కడివో ఉద్యోగులే చెప్పాలి!

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు తెలిసిన ఆదాయంతో పోలిస్తే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు కోర్టులో నిరూపితమైతే.. ఆ అదనపు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరించాల్సిన బాధ్యత ఆ ఉద్యోగిపైనే ఉంటుందని స్పష్టం చేసింది. నిందితుడు చెప్పే ప్రతి ఆదాయ మార్గాన్ని వెతుకుతూ దర్యాప్తు అధికారులు అంతులేని విచారణ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

ఒక ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే జీతం, ఇతర తెలిసిన ఆదాయాలతో పోలిస్తే అతడి ఆస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయని దర్యాప్తులో తేలితే.. ఆ ఆస్తులను ఎలా సంపాదించారో నిందితుడు వివరించాల్సి ఉంటుంది. ఆస్తులు చట్టబద్ధమైన ఆదాయం ద్వారానే సంపాదించినట్లు నిరూపించేందుకు నమ్మదగిన ఆధారాలు చూపించాలి. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని కొనడానికి డబ్బు ఎలా వచ్చింది? వంటి వివరాలు సంబంధిత వ్యక్తికే తెలిసే అవకాశం ఉన్నందున.. వాటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా అతడిపైనే ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

అంతేకాకుండా, నిందితుడు తనకు ఈ ఆదాయం వచ్చింది, ఆ మార్గంలో డబ్బు సంపాదించానని చెబితే.. ఆ ప్రతి అంశాన్ని వెతికి నిరూపించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపై ఉండదని స్పష్టం చేసింది. అయితే, ముందుగా నిందితుడికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

అవినీతి నిరోధక చట్టం కింద ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన కేరళ మాజీ ప్రభుత్వ అధికారి వి. గోపాలకృష్ణన్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. అయితే, ఆయన అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. గతంలో వెలువడిన దోష నిర్ధారణను సమర్థించింది. మిగిలిన శిక్షను అనుభవించేందుకు రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అదనపు సంపదకు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిన బాధ్యతపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది.

About The Author