న్యాయమూర్తులను ప్రభుత్వం నియమించే పాత వ్యవస్థ కంటే సుప్రీంకోర్టు కొలీజియం ఏమాత్రం మెరుగైనది కాదని ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. కొలీజియం వ్యవస్థ తన ‘ఇష్టానుసారంగా’ న్యాయమూర్తులను నియమిస్తూనే ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయ జవాబుదారీతనం, సంస్కరణల ప్రచార సంస్థ(సీజేఏఆర్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో జస్టిస్ శర్మ భారత సుప్రీంకోర్టు, హైకోరు న్యాయమూర్తుల ‘జవాబుదారీతనం’ అనే అంశంపై ప్రసంగించారు.
కొలీజియం వ్యవస్థ దాదాపు పూర్తిగా విఫలమైంది. చరిత్రలోకి వెళితే 1993, 1998లలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పుల ద్వారా ఈ కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. అంతకుముందు రాజ్యాంగబద్ధమైన కోర్టుల్లో (హైకోర్టులు, సుప్రీంకోర్టు) న్యాయమూర్తుల నియామకాలను ప్రభుత్వమే చేసేది. అప్పట్లో ఈ ప్రక్రియలో బంధుప్రీతి ఎక్కువగా ఉందని, ప్రభుత్వం తన రాజకీయ భావజాలానికి అనుగుణంగా ఉన్న వ్యక్తులనే నియమిస్తున్నదని బలమైన అభిప్రాయం ఉండేది అని జస్టిస్ శర్మ తెలిపారు.
న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని ప్రభుత్వం నుంచి తొలగించి ఆ బాధ్యతను సుప్రీంకోర్టు తన చేతుల్లోకి తీసుకుందని ఆమె చెప్పారు. “అయితే, నిజాయితీగా చెప్పాలంటే ఈ పరిష్కారం అసలు సమస్య కంటే దారుణంగా తయారైంది. నా దగ్గర దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు బంధుప్రీతి, పక్షపాతం అనేవి మరింత స్పష్టంగా, మరింత బహిరంగంగా, మరింత రాజకీయ ప్రేరేపితంగా, పూర్తిగా బంధువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి” అని ఆమె ఆరోపించారు.
“ఒకానొక దశలో నేను స్వయంగా కొలీజియం వ్యవస్థకు మద్దతుదారునిగా ఉండేదానిని. అయితే, చాలా స్పష్టంగా చెప్పాలంటే—కొలీజియం వ్యవస్థ దాదాపు పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను” అని ఆ మాజీ న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాంబే హైకోర్టుకు అప్పటి సీజేఐ మేనల్లుడి నియామకాన్ని ప్రస్తావిస్తూ, కొలీజియం చర్చల నుంచి సీజేఐ తప్పుకోవడం సరిపోతుందా? అని జస్టిస్ శర్మ ప్రశ్నించారు.
“దాని గురించి గుసగుసలు వినిపించినప్పుడు, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి కొలీజియం చర్చల నుంచి తప్పుకున్నారని మాకు చెప్పారు. అది సరిపోతుందా?” అని ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రశ్నించారు. సీజేఐ పదవి నుంచి వైదొలిగే వరకు ఈ నియామకం ఆగగలిగేదా? అని ఆమె ఇంకా ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ప్రవర్తన విషయానికి వస్తే, విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యల వ్యవహారాన్ని నిర్వహించిన తీరును ఆ మాజీ న్యాయమూర్తి విమర్శించారు.
“ఆయన్ను కొలీజియం పిలిపించింది/ తన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి ఆయన అంగీకరించినట్లు తెలిసింది. కానీ ఆయన అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళినప్పుడు, తన మాట తప్పడమే కాకుండా, ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా తాను న్యాయపరమైన మర్యాదకు సంబంధించిన ఏ సూత్రాలను ఉల్లంఘించలేదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు,” అని ఆమె గుర్తు చేశారు.
కల్నల్ సోఫియా ఖురేషీకి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించడంలో జస్టిస్ అతుల్ శ్రీధరన్ పాత్రను ప్రస్తావిస్తూ, ఆయన విషయంలో వ్యవహరించిన తీరుతో దీనిని ఆమె పోల్చారు. ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఛత్తీస్‌గఢ్ నుండి అలహాబాద్‌కు ఆయన ప్రతిపాదిత బదిలీని మార్చాలన్న కొలీజియం నిర్ణయాన్ని జస్టిస్ శర్మ ప్రశ్నించారు.
జస్టిస్ శర్మ, జస్టిస్ అకిల్ ఖురేషి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందకపోవడాన్ని కూడా ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి ఆయన పదోన్నతి ఇష్టం లేకపోవడం, అయితే జస్టిస్ రోహింటన్ నారిమన్ ఆయనను చేర్చాలని పట్టుబట్టడంతో కొలీజియం ప్రతిష్టంభనలో పడిందని తెలిపారు. జస్టిస్ నారిమన్ పదవీ విరమణ తర్వాత, జస్టిస్ ఖురేషిని మినహాయించి తొమ్మిది పేర్లను సిఫార్సు చేశారని ఆమె పేర్కొన్నారు. “నేను ప్రత్యేకంగా ఎవరి వాదనకూ మద్దతు ఇవ్వడం లేదు. కొలీజియం ఎలా పనిచేస్తుందో సూచించడానికి ప్రయత్నిస్తున్నాను,” అని జస్టిస్ శర్మ వివరించారు
“మనం ఎవరిని నిందించాలి? ప్రభుత్వాన్నా లేక కొలీజియంనా? కొలీజియం గట్టిగా నిలబడలేదా?” అని ఆమె అడిగారు. కొలీజియం పనితీరుకు, గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నియామకాల విధానానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించలేదని మాజీ న్యాయమూర్తి తేల్చి చెప్పారు. “ప్రభుత్వం నియామకాలు జరిపిన విధంగానే కొలీజియం వ్యవస్థ కూడా పనిచేస్తుంది. నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు,” అని ఆమె పేర్కొన్నారు.

More Stories
యుపిలో హింసాత్మక ఆందోళనల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు
పాక్ స్పై నెట్వర్క్ కేసులో మరో ఇద్దరి అరెస్టు !
ఏపీ పై అర్నబ్ పంజా.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అతలాకుతలం