ఏపీ పై అర్నబ్ పంజా.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అతలాకుతలం

ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తు పాను తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, పెనుగాలులతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. పలు జిల్లాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి చెందారు. పంటలు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది.

ఎడతెరిపి లేని వానలతో వాగులు, గెడ్డలు పొంగి రహదారులను ముంచెత్తడంతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అయింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు సమీపంలోని పెద్దగెడ్డ పొంగి ప్రవహించడంతో, సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలయ ఘోషను వినిపిస్తూ.. ఉభయ గోదావరి జిల్లాలను ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. 

గాలుల ధాటికి 33 వేల కొబ్బరి చెట్లు మేకమేడల్లా కూలిపోయాయి. 16 వేల విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో ‘గోదావరి’ జిల్లాల్లోని చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఇళ్లలో ఉన్న, పనుల మీద బయటకు వచ్చిన తొమ్మిది మంది విద్యుదాఘాతానికి, చెట్లు కూలి మరణించారు. వరి పైరు భారీ వర్షాలు, పెను గాలులతో చాపలా నేలవాలింది. 3 లక్షలకు పైగా హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. 

ఎక్కడికక్కడ రహదారులపై చెట్లు పడిపోవడంతో ఉత్తరాంధ్రలో రవాణా స్తంభించింది. రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం 40కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.

బంగాళాఖాతంలో భయాందోళనలు సృష్టించిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుపాను క్రమంగా శాంతిస్తోంది. ప్రస్తుతం ఇది బలహీనపడి సాధారణ తుపానుగా మారింది. ఈ రోజు రాత్రికి ఇది మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ, రాష్ట్రానికి వర్షాల ముప్పు మాత్రం ఇంకా పొంచే ఉందని అధికారులు స్పష్టం చేశారు. 

మరో ఏడు రోజులపాటు కూడా భారీ వర్షాలు కొన‌సాగుతాయ‌ని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తాజా బులెటిన్ ప్రకారం, కోస్తాంధ్ర 13 జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తీర ప్రాంత ప్రజలందరూ తక్షణమే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

 వర్షాలతో పాటుగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్​తో పాటు ఒడిశా, తమిళనాడులో జనజీవనాన్ని ప్రభావితం చేసింది. ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిశాయి. ఒడిశాలో చెట్లు కూలి రహదారులు మూసుకుపోగా, కొన్ని ప్రాంతాల్లో వంతెన కూలడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 234 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 73 మంది మహిళలకు సురక్షితంగా ప్రసవాలు జరిగాయి. మరోవైపు చెన్నై విమానాశ్రయంలో 12 విమానాలను రద్దు చేయగా, రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

 ‘‘తుపాను మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. శిబిరాల్లోని బాధితులకు రూ.1000 చొప్పున రూ.మూడు వేల వరకు సాయం చేస్తాం. కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బ తింటే రూ.25 వేలు, రూ.40 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.50 వేలు, రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర లోపు టర్నోవర్‌ ఉన్న వాటికి రూ.లక్ష, రూ.కోటిన్నరకు పైగా టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.1.5 లక్షల సాయం అందిస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

“ద్విచక్ర వాహనం దెబ్బతింటే రూ.3 వేలు, త్రిచక్ర వాహనానికి రూ.10 వేల సాయం, దెబ్బతిన్న ఫిషింగ్‌ బోట్లకు రూ.9 వేలు, వలల మరమ్మతులకు రూ.5 వేలు, వలలు ఉన్న ఫిషింగ్‌ బోటు దెబ్బతింటే రూ.25 వేల సాయం చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు. ఇళ్లలో నీళ్లు చేరిన బాధితులకు 25 కిలోల బియ్యం, పశువులు నష్టపోయిన వారికి రూ.50 వేలు సాయం అందిస్తామని చెప్పారు. 

 చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడి, రాష్ట్రంలో తుపాను వల్ల జరిగిన ‘భారీ నష్టం’ గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా తుపాను ప్రభావం ఎలా ఉందో అమిత్ షాకు తెలియజేసినట్లు ముఖ్యమంత్రి ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.

“జరిగిన విస్తృత నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను వీలైనంత త్వరగా పంపాలని, అలాగే సహాయక, పునరావాస మరియు పునరుద్ధరణ పనులకు మద్దతుగా భారత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్ర హోంమంత్రిని కోరాను” అని ముఖ్యమంత్రి తెలిపారు.

About The Author