* ఖండించిన భారత సైన్యం, కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. కిరణ్ రిజిజు
భారత సరిహద్దు భద్రత, అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా ఆక్రమణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసిన వీడియోలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. బీహార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రీతూ చౌదరి సహా పలువురు నాయకులు షేర్ చేసిన వీడియోలు పూర్తిగా నకిలీవని, పక్కా ఆధారాలతో కూడిన డీప్‌ఫేక్ కంటెంట్ అని భారత సైన్యం అధికారికంగా స్పష్టం చేసింది.
ఆ ఆరోపణలను తిరస్కరిస్తూ, ఒక సీనియర్ సైనిక అధికారికి కల్పిత వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించేందుకు, పాత ఫుటేజ్‌ను ఉపయోగించి ఆ వీడియోను డిజిటల్‌గా మార్ఫింగ్ చేశారని సైన్యం తెలిపింది. “అరుణాచల్ ప్రదేశ్‌లోని అసఫిలా, లాంగ్‌జౌ, టాక్సింగ్ సర్కిల్‌లను చైనా స్వాధీనం చేసుకుందని, భారత సైన్యానికి అవసరమైన సరఫరాలను నిరాకరించారని లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియాకు ఆపాదించిన కల్పిత వ్యాఖ్యలతో కూడిన డిజిటల్‌గా మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి ప్రచారం చేయబడుతోంది,” అని సైన్యం ఫ్యాక్ట్-చెకింగ్ హ్యాండిల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
“ఈ తప్పుదారి పట్టించే వీడియో, కల్పిత ప్రకటనలను ఒక సీనియర్ భారత సైనికాధికారి లీక్ చేసిన అంగీకారంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. ఈ వీడియో లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియాకు వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించడానికి #సింథటిక్జెనరేటెడ్ఇన్ఫర్మే షన్ను ఉపయోగిస్తోంది,” అని అది జోడించింది.
సైన్యం ఈ వ్యవహారంలో వాస్తవాలను వెల్లడించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై అత్యంత ఘాటుగా స్పందించారు. భారత సైన్యాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు, శత్రు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా కాంగ్రెస్ ఇలాంటి నీచమైన ప్రచారాలకు ఒడిగడుతోందని ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసిన మొదటి వీడియోలో చైనా వాణిజ్య వాహనాలు భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు చూపించారు.
అయితే దీనిపై సైన్యం స్పందిస్తూ సదరు దృశ్యాలు సిక్కిం సరిహద్దులోని నాథూలా పాస్ వద్ద నమోదైనవని తేల్చి చెప్పింది. అది ఇరుదేశాల మధ్య అనుమతించిన అధికారిక వాణిజ్య మార్గమని, అక్కడ సాధారణంగా తిరిగే వ్యాపార వాహనాలను సైనిక చొరబాట్లుగా చిత్రీకరించడం అత్యంత దారుణమని పేర్కొంది. అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా స్వాధీనం చేసుకుందని లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియా (జీఓసీ, స్పియర్ కార్ప్స్) చెబుతున్నట్లుగా ఉన్న రెండవ నకిలీ వీడియో ఒక డీప్‌ఫేక్ అని సైన్యం స్పష్టం చేసింది.
“అసలు ఫుటేజ్, నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలకు సంబంధించి 2023 అక్టోబర్ 27న జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఒక పత్రికా సమావేశానికి సంబంధించినది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా నియంత్రణ గురించి గానీ, భారత సైన్యానికి సరఫరాలను నిరాకరించడం గురించి గానీ ఆయన అలాంటి ప్రకటనలు ఏవీ చేయలేదు,” అని సైన్యం ఒక పోస్ట్‌లో పేర్కొంది.
2023 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాట్లపై ఆయన ఇచ్చిన పాత విలేకరుల సమావేశం దృశ్యాలను మార్ఫింగ్ చేసి, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఆక్రమించిందని ఆయన చెప్పినట్లుగా తప్పుడు వాయిస్ ఓవర్ క్రియేట్ చేశారని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ భారత ఆర్మీ పరువు తీయడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా రూపొందించిన నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ చేస్తున్న ఈ ద్రోహపూరిత చర్యలు శత్రు దేశాలు చేసే కుట్రలకు ఏమాత్రం తక్కువ కాదని, శత్రువుల తరఫున ఆ పార్టీ ఈ అసహ్యకరమైన ప్రచారాన్ని నడుపుతోందని విమర్శించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ స్పందిస్తూ.. మన వీర సైనికుల ప్రతిష్టను దెబ్బతీయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, ఇది వారి సైనిక వ్యతిరేక ఆలోచనా విధానాన్ని మరోసారి బహిర్గతం చేసిందని మండిపడ్డారు.
అయితే ఈ విమర్శలపై ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు వినోద్ జఖర్ వీడియోలు మార్ఫింగ్ చేయబడినప్పటికీ వాటిలో చెప్పిన విషయాలు నిజమేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న యువతను అడ్డుకోవడానికి బలగాలను మోహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం అరుణాచల్‌లో చైనా చొరబడుతుంటే అక్కడ ఎందుకు బలగాలను రంగంలోకి దించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఏది ఏమైనప్పటికీ సరిహద్దు భద్రతపై అసత్య ప్రచారాలు చేయడం, సైనికాధికారుల వీడియోలను డీప్‌ఫేక్ చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సాయుధ దళాల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నందుకు కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు చేసింది.
“మన ధైర్యవంతులైన సాయుధ దళాల ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక డీప్‌ఫేక్ వీడియోను వ్యాప్తి చేయడం, ఆ పార్టీ యొక్క నీచమైన సేన విరుద్ధ మనస్తత్వాన్ని మరోసారి నిస్సందేహంగా రుజువు చేస్తోంది. మన సాయుధ దళాల ప్రతిష్టను దెబ్బతీయడం, వారి గౌరవాన్ని కించపరచడం విషయంలో కాంగ్రెస్ పదేపదే నేరాలకు పాల్పడుతూనే ఉంది,” అని బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

More Stories
జమ్మూ కాశ్మీర్ చరిత్రలో మొదటిసారి జమ్ముకు ప్రాతినిధ్యం లేని మంత్రివర్గం
ఈ20 పెట్రోల్‌పై విమర్శలు డబ్బులతో చేసిన ప్రచారం
ఓ రాజకీయ దిగ్గజాన్ని కూలదోసి సెర్బియా విద్యార్థి ఉద్యమం