దాడులు ఆపితే ఒక బిలియ‌న్ డాల‌ర్‌లు.. హౌతీల‌కు సౌదీ భారీ ఆఫ‌ర్‌

సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులతో పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్ర‌స్థాయికి చేరాయి. సౌదీలోని మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలను హౌతీలు డ్రోన్‌లు, క్షిపణులతో టార్గెట్ చేస్తుండటంతో సంపన్న దేశం తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను చవిచూస్తున్న‌ది. హర్మూజ్ జ‌ల‌సంధిలో ట్యాంకర్లపై ఇరాన్ చేస్తున్న దాడులవల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులకు కూడా అంతరాయం కలుగుతున్న‌ది.

దేశంలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై దాడులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఎట్టకేలకు హూతీలతో రాజీకొచ్చారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్‌ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుదారులకు ఓ ఆఫర్ ఇచ్చారు. హౌతీలు తమ దేశంపై దాడులను పూర్తిగా ఆపితే 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,500 కోట్లు) ఇస్తామని సౌదీ యువరాజు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

మరోవైపు, ప్రాంతీయ సంక్షోభాన్ని తగ్గించేందుకు సౌదీ, టర్కీ, పాకిస్థాన్ ప్రతినిధులు ఇరాన్‌లో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తాన్ని ఇరాన్ ద్వారానే హూతీలకు అందించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ మీడియాలో కథనాలు వెలువ‌డ్డాయి.  సౌదీ భూభాగం, చమురు మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడం ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం కోసమే ఇటీవల సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ టెహ్రాన్‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఆయన వచ్చిన సైనిక రవాణా విమానంలోనే హౌతీలకు ఇవ్వదలిచిన మొత్తం డబ్బును తీసుకువచ్చినట్లు తెలుస్తున్న‌ది. అయితే ఈ విషయాన్ని సౌదీ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అక్టోబర్ 26న సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో చర్చలు జరిపింది. 

ఈ సమావేశంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, తుర్కియే నిఘా విభాగాధిపతి ఇబ్రహీం కాలిన్ తదితరులు పాల్గొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతోనూ ప్రాంతీయ భద్రత, ఉద్రిక్తతల తగ్గింపు, దౌత్యపరమైన పరిష్కారాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. 

ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం సైనిక ఘర్షణలు మరింత విస్తరించకుండా అడ్డుకోవడం, చర్చలకు మార్గం సుగమం చేయడం. సౌదీ విదేశాంగ శాఖ కూడా టెహ్రాన్ పర్యటన ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా జరిగిందని ప్రకటించింది.  గతంలో హూతీలు యెమెన్ సర్కారుతో పోరాడుతున్న సంద‌ర్భంలో వ్యతిరేకంగా సౌదీ అరేబియా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య ప్రత్యక్ష పోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే సౌదీ వారితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకు వచ్చింది.

About The Author