* దేశవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ సిద్ధం!.. పాట్నా పోలీసులకు ఫిర్యాదు
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన “మోదీ కా బాప్ భీ జాయేగా” (మోదీ తండ్రి కూడా వెళ్లిపోతారు) అనే వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ “గుండాలు, దుండగుల” భాషను ఉపయోగిస్తోందని, ఆ పార్టీ పనితీరు ఒక “మాఫియా ముఠా”లా ఉందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖర్గే వ్యాఖ్యలు ప్రధానిని, ఆయన దివంగత తండ్రిని మాత్రమే కాకుండా, దేశాన్ని కూడా అవమానించేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది.
ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బిహార్ బీజేపీ పోలీసుల్ని ఆశ్రయించింది. పట్నాలోని పోలీస్ స్టేషన్లో మల్లికార్జున్ ఖర్గేపై ఫిర్యాదు నమోదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన తండ్రిని ఉద్దేశించి ఖర్గే అవమానకరమైన భాష ఉపయోగించారని ఆరోపించిన అక్కడి నాయకులు, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ, “ఒకప్పుడు గుండాలు, దుండగులు వాడే భాషను ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపయోగిస్తున్నారు. నిరాశలో ఉన్న వారి ‘యువరాజు’ (రాహుల్ గాంధీని ఉద్దేశించి), ఒకసారి వీధుల్లో మహిళా పోలీసు సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తే, మరోసారి సొంత పార్టీ నాయకుల తోనే గొడవలకు దిగుతున్నారు” అని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ పనితీరు ఒక మాఫియా తరహాలో మారిపోయిందని, అది ఒక రాజకీయ పార్టీలా కాకుండా “మాఫియా ముఠా”లా కనిపిస్తోందని బీజేపీ ఆరోపించింది.
కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ, ఖర్గే చేసిన వ్యాఖ్యల్లో ప్రతిబింబించే రాజకీయ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు పదేళ్లపాటు ప్రయత్నించారని, కానీ చివరికి ప్రజలు వారిని అధికారంలో నుంచి తొలగించారని ఎద్దేవా చేసింది. “వారి మొత్తం పనితీరు ఒక మాఫియా తరహాలో ఉంది. వారు రాజకీయ పార్టీ కంటే మాఫియా ముఠాలా కనిపిస్తున్నారు. ఖర్గే గారు చెప్పిన ఆ కలను నిజం చేసుకోవడానికి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు పదేళ్లపాటు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ప్రజలు వారిని అధికారంలో నుంచి గెంటేశారు” అని బీజేపీ పేర్కొంది.
“నేడు, ఆమె కుమారుడు అదే కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తూ, ఒకసారి వియత్నాం, మరోసారి కొలంబియా అంటూ తిరుగుతున్నారు” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ వ్యాఖ్యానించింది. “ఈ దేశ ప్రజలు మీ కలను ఎప్పటికీ నిజం కానివ్వరు” అని ఆ పార్టీ స్పష్టం చేసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “మోదీ గారి తండ్రిని లక్ష్యంగా చేసుకోవడం” ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజకీయ మర్యాదలను పూర్తిగా అతిక్రమించిందని విమర్శించారు. ప్రధానిని, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ పదేపదే అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తోందని అమిత్ షా ఆరోపించారు. 2014 నుంచి వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో కాంగ్రెస్ నిరాశ, నిస్పృహల్లో ఉండి ఇలాంటి కామెంట్స్ చేస్తోందని మండిపడ్డారు.
“కాంగ్రెస్ పార్టీ మోదీజీని లేదా ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి అసభ్యకరమైన భాషను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వారు ఆయన గౌరవనీయులైన తల్లిని అవమానించారు, ఆయన్ని ‘మరణ వ్యాపారి’ అని పిలిచారు. అలాగే ఆయన పేదరికాన్ని ఎగతాళి చేస్తూ ‘చాయ్‌వాలా’ అని కూడా సంబోధించారు” అని ఆయన గుర్తు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా కాంగ్రెస్ అధినేతను విమర్శిస్తూ, ఇది ఆ పార్టీ “సైద్ధాంతిక దివాళాకోరుతనానికి” నిదర్శనమని ధ్వజమెత్తారు. “రాజకీయ విమర్శలకు కూడా ఒక గౌరవప్రదమైన పద్ధతి ఉంటుంది. కానీ, బహిరంగ వేదికలపై ప్రసంగించేటప్పుడు ఇక లేని కుటుంబ సభ్యులను కూడా లాగడం అనేది రాహుల్ గాంధీకి, మొత్తం ప్రతిపక్షానికి ఒక ‘సంస్కృతి’గా మారిపోయింది. ఇది ఖర్గేజీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్య మాత్రమే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంలో ఉన్న సంస్కారహీనతకు నిదర్శనం” అని నబిన్ మండిపడ్డారు.
ఇతర కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, గిరిరాజ్ సింగ్, పీయూష్ గోయల్ సహా మాజీ మంత్రులు, ఎంపీలు ధర్మేంద్ర ప్రదాన్, రవిశంకర్ ప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ కూడా ఖర్గే వ్యాఖ్యల్ని ఖండిస్తూ, తక్షణమే మోదీకి, దేశప్రజలకు ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీహార్ మొదటి ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సింగ్ 139వ జయంతి సందర్భంగా పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఖర్గే ప్రసంగిస్తుండగా ఈ వివాదం చెలరేగింది. ఖర్గే ప్రసంగిస్తుండగా గందరగోళం నెలకొంది. ప్రసంగం మధ్యలో, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లరని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఖర్గే, “మోదీ కా బాప్ భీ జాయేగా” (మోదీ తండ్రి కూడా వెళ్ళిపోతాడు) అని అన్నారు.
అంతేకాకుండా, ప్రధాని మోదీకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని ఆయన విమర్శించారు. “ప్రధాని మోదీకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ డబ్బు ఏమైంది?” అని ఖర్గే ప్రశ్నించారు.
అలాగే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన, దేశంలో ఆ సంస్థ సిద్ధాంతాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. “ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉన్నంత కాలం, శాంతి ఉండదు” అని ఆయన విమర్శించారు. సంఘ్ తన ఆవిర్భావం నుండే మతపరమైన విభజనలకు పాల్పడుతోందని కూడా కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు

More Stories
హర్మన్, దీప్తి సెంచరీలు… జింబాబ్వేపై భారత్ ఘన విజయం
విధానాలపై పెరుగుతున్న నిరసనలతో అట్టుడికిపోతున్న ఐరోపా
ఇస్లామియాలోకి `అక్రమ ప్రవేశము’.. ముగ్గురు ఎంపీలపై కేసు!