భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ‘వింగ్స్ ఓవర్ గంగాస్’ అనే ఇతివృత్తంతో వారణాసిలోని నమో ఘాట్‌లో నిర్వహించిన వైమానిక దళ దినోత్సవ వైమానిక ప్రదర్శన-2026కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న భారత వైమానిక దళ (ఐఏఎఫ్) దినోత్సవ వైమానిక ప్రదర్శన-2026కు ఆతిథ్యం ఇచ్చేందుకు వారణాసి నగరం సిద్ధమవుతున్న తరుణంలో, సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ (ఎస్కేఏటీ) ఆదివారం ఉదయం గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది. 94వ భారత వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘వింగ్స్ ఓవర్ గంగాస్’ పేరుతో ఈ వైమానిక ప్రదర్శనను నమో ఘాట్‌లో నిర్వహిస్తున్నారు.
సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్, సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్‌తో సహా ఐఏఎఫ్ యొక్క ప్రముఖ ప్రదర్శన బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఈ వైమానిక ప్రదర్శనలో తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్ సి హెచ్) ప్రచండ్, ఐఎల్-76, ఐఎల్-78, సి-295, ఏఎన్-32 వంటి విమానాలతో పాటు, ఎస్యు-30ఎంకేఐ, రఫేల్ వంటి ఫ్రంట్‌లైన్ ఫైటర్ విమానాలతో సహా విభిన్న రకాల విమానాలు ప్రదర్శించారు.
భారత నౌకాదళం, భారత సైన్యానికి చెందిన విమానాలు కూడా పాల్గొని, కార్యకలాపాలలో సంయుక్తతను ప్రదర్శిస్తాయని భావిస్తున్నారు. వైమానిక ప్రదర్శనకు హాజరయ్యే ముందు, ప్రధాని మోదీ వారణాసిలో అరవింద్ లిమిటెడ్ కొత్త వస్త్ర తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. పారిశ్రామిక పెట్టుబడులు, తయారీ రంగ ఆధారిత వృద్ధి, మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి ఈ ప్రాంతానికి ఉన్న సామర్థ్యాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.
పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉత్తర ప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేయడానికి, దాని వస్త్ర, దుస్తుల తయారీ రంగాన్ని విస్తరించడానికి ఈ ప్రారంభోత్సవం ఒక ముందడుగు. ప్రధానంగా మహిళల నేతృత్వంలోని ఈ కార్యక్రమం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యంపై, మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడంపై ఉన్న దృష్టిని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ సదుపాయం వస్త్ర తయారీ రంగంలో అవకాశాలను సృష్టించడంతో పాటు, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది స్థానికులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు బీజేపీ జెండాలు, జాతీయ త్రివర్ణ పతాకం, పూలు, సాంప్రదాయ డప్పులతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి తన వాహనం నుంచి జనసమూహానికి అభివాదం చేయగా, ప్రజలు “హర్ హర్ మహాదేవ్”, “జై శ్రీరామ్” అంటూ నినాదాలు చేశారు.

More Stories
‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర
కాశ్మీరీలు, పాకిస్తాన్‌పై ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు `దేశద్రోహం’.. బీజేపీ
జామియాలో “ఫ్రీ కాశ్మీర్”, “ఫ్రీ షర్జీల్ ఇమామ్” పట్ల దుమారం