జింబాబ్వేపై వన్డే సిరీస్ తొలి మ్యాచ్​లో భారత్‌ ఘన విజయం!

* షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం 

వడోదర వేదికగా జింబాబ్వేతో జరిగిన మొదటి వన్డేలో భారత మహిళా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని భారత్ 27.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ప్రతీకా రావల్ సెంచరీ (100* పరుగులు)తో అదరగొట్టగా, షఫాలి వర్మ (64 పరుగులు, 33 బంతుల్లోనే) ధనాధన్ ఇన్నింగ్స్​తో చెలరేగింది. జింబాబ్వే బౌలర్లలో ఒలిందర్ చారే 1 వికెట్ దక్కించుకుంది. శతకంతో ఆకట్టుకున్న ప్రతీకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

స్వల్ప ఛేదనను భారత్ ఘనంగా ఆరంభించింది. స్మృతి మంధాన (32 పరుగులు)- ప్రతీకా రావల్ జట్టుకు మెరుగైన ఆరంభం ఇచ్చారు. ఈ ఇద్దరు తొలి వికెట్​కు 94 పరుగులు జోడించారు. ఒలిందర్ బౌలింగ్​లో 15.3 ఓవర్​ వద్ద స్మృతి క్యాచౌట్​గా వెనుదిరిగింది. అయితే మ్యాచ్​లో జింబాబ్వే సంబరాలు చేసుకున్న ఏకైక మూమెంట్​ అదే. ఆ తర్వాత ప్రతీకకు జతకట్టిన షఫాలీ తొలి నుంచే దూకుడుగా ఆడింది. 

ధనాధన్ ఇన్నింగ్స్​తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో భారత్ విజయానికి దగ్గరైంది. ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్​లతో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అనంతరం బౌండరీతో ప్రతీక సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమె 96 బంతుల్లోనే 100 పరుగులు చేసింది. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. వన్డేల్లో ప్రతీకకు ఇది రెండో సెంచరీ. ఆ తర్వాత ఓవర్ (27.1)​ తొలి బంతికే షఫాలీ ఫోర్ బాది జట్టుకు విజయం అందించింది. ఈ ఇద్దరు రెండో వికెట్​కు అజేయంగా 70 బంతుల్లోనే 106 పరుగులు జోడించారు.

అంతకుముందు టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల దెబ్బకు జట్టుకు పేలవమైన ఆరంభం లభించింది. ఓపెనర్ లోరిన్ ఫిరి (1 పరుగు) సింగిల్ డిజిట్​కే పెవిలియన్ చేరింది. ఆమెను ముడో ఓవర్ మూడో బంతికి క్రాంతి గౌడ్ ఔట్ చేసింది. ఆ తర్వాత ముపాచిక్వా – చిపో ముగెరి తిరిపానో రెండో వికెట్​కు 46 పరుగులు జోడించారు. 

అయితే 10.1 వద్ద ఈ జోడీని శ్రీచరణి విడగొట్టింది. ఆమె తిరిపానో (21 పరుగులు)ను ఔట్ చేసింది. ఆ తర్వాత జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టు 113 పరుగుల మార్కుకు చేరుకునేలోపు 5 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బిలోవ్​డ్ బిజా (62 పరుగులు) ఆదుకుంది. ఓపిగ్గా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించింది. మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లతో సత్తా చాటగా, క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 2, షఫాలి వర్మ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుంది.
 

 

About The Author