చిన్మయ మిషన్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అదొక ఆలోచనా విధానమని కొనియాడారు. భారత్ సంస్కృతికి జన్మస్థలమని, దేశ ఉనికికి పునాది అని ప్రధానమంత్రి పేర్కొంటూ వ్యక్తిగత పురోగతి అనేది జాతీయ అభివృద్ధికి ఒక సాధనంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా స్వామి చిన్మయానంద బోధనలను, ఆధ్యాత్మిక వృద్ధిని దేశాభివృద్ధికి అనుసంధానించేందుకు ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.
‘వయం రాష్ట్ర జాగృయామ్ పురోహితాః’ అనే వేద మంత్రాన్ని చెబుతూ, దేశాన్ని చైతన్యవంతంగా, అభివృద్ధి చెందినదిగా మార్చేందుకు ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయుల్లో తమ దేశం పట్ల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే స్వామి చిన్మయానంద లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు.
“ఈ దేశమే మన ఉనికికి పునాది. మన ఆధ్యాత్మిక పురోగతిని వ్యక్తిగత వికాసంతో అనుసంధానించాలని, దానిని దేశాభివృద్ధికి ఒక సాధనంగా మార్చుకోవాలని స్వామీజీ మనకు బోధించారు. భారతీయుల్లో దేశం పట్ల ఆత్మగౌరవాన్ని నింపడమే ఆయన లక్ష్యం. ఇదే ఉద్దేశంతో ఆయన ‘గీతా జ్ఞాన యజ్ఞాన్ని’ ప్రారంభించి, ఉపనిషత్తులు, వేదాంతం మన ఇతర శాస్త్రాల జ్ఞానాన్ని సామాన్య ప్రజల వరకు చేరవేశారు. ఆయన తీసుకున్న ఆ సంకల్పం ఫలితాలను ఇప్పుడు మనం చూడవచ్చు” అని మోదీ పేర్కొన్నారు.
మిషన్ విద్యా కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దాని వందకు పైగా సంస్థలు ఆధునిక విద్యను భారతీయ విలువలతో మేళవించి లక్షలాది మంది పిల్లలు, యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయని ప్రధాని మోదీ కొనియాడారు. మారుతున్న భారతదేశ అవసరాలను తీర్చడానికి జాతీయ విద్యా విధానం కూడా భారతీయ విజ్ఞాన సంప్రదాయాలు, మాతృభాషా విద్య, ఆధునిక విజ్ఞానం, నూతన సాంకేతికతలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు.
వారసత్వ పరిరక్షణపై మాట్లాడుతూ, కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణానికి ఏక్‌నాథ్ రానడే చేసిన కృషికి, ఆ ప్రాజెక్టుకు తొలి ఆర్థిక విరాళం అందించడంతో పాటు స్వామి చిన్మయానంద అందించిన మద్దతును ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. చిన్మయ మిషన్ తన శతజయంతి దిశగా సాగించే ప్రయాణం, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో సమాంతరంగా ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఉమ్మడి లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన మిషన్ సభ్యులను కోరారు.

More Stories
నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
ట్రంప్ అల్లుడి ఫోన్ హ్యాక్ వెల్లడించిన విదేశీ రహస్య ఖాతాలు!
ఈసీ సీనియర్ అధికారిపై చర్యకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరణ