మహిళా రిజర్వేషన్ బిల్లుకు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రతిపాదనలకు సంబంధించి ప్రతిపక్షాలతో ఇప్పటికే చర్చలకు ప్రయత్నించామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌పై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కీలక చట్టాల ఆమోదానికి అడ్డంకులు సృష్టించకుండా, నిర్మాణాత్మక సహకారం అందించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను కోరారు.
డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో చర్చకు తీసుకురాకముందే ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఖర్గే అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీకి నాలుగోసారి లేఖ రాశారు. దీనికి సమాధానంగా ఖర్గేకు సోమవారం రాసిన లేఖలో ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నించిందని రిజిజు స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 16, మార్చి 26, ఏప్రిల్ 12 తేదీల్లో ఖర్గేకు లేఖలు రాసి, బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
ఖర్గేతో వ్యక్తిగతంగా కూడా ఈ అంశంపై చర్చించినట్లు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోనూ వ్యక్తిగతంగా తాను సమావేశమై బిల్లుకు సహకారం కోరినట్లు వెల్లడించారు. అయితే పలుమార్లు తాము విజ్ఞప్తి చేసినప్పటికీ చర్చల కోసం కాంగ్రెస్ తేదీలను ఖరారు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరిపిందని తెలిపారు.
డీలిమిటేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కోసం సాధించేందుకు పలు పార్టీలతో ఇప్పటికే చర్చలు నిర్వహించినట్లు రిజిజు పేర్కొన్నారు. తాము చర్చలు జరిపిన వారిలో డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యుబిటి), ఎంఐఎం, బిజూ జనతాదళ్ ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. అయినా, అఖిలపక్ష సమావేశం కోసం మళ్లీ కాంగ్రెస్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే జరిగిన సంప్రదింపులను పరిగణనలోకి తీసుకోకుండా అదే డిమాండ్‌ను పునరావృతం చేయడం కంటే, ప్రతిపక్షాల నుంచి బిల్లుకు నిర్మాణాత్మక సహకారం అవసరం’ అని రిజిజు తన లేఖలో పేర్కొన్నారు.
జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని గౌరవిస్తుందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి ఉందని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్ 13న నిరవధికంగా వాయిదా పడినా ఇప్పటివరకు సభను అధికారికంగా ప్రోరోగ్ (సెషన్ అధికారికంగా ముగించడం) చేయలేదని ఖర్గే లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత ఎంత వ్యవధిలో ప్రోరోగ్ చేయాలనే దానిపై రాజ్యాంగం నిర్దిష్ట గడువును విధించలేదని స్పష్టం చేశారు.

More Stories
ఎల్ కె అద్వానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
జింబాబ్వేపై భారత్ మహిళా జట్టు ఘన విజయం- సిరీస్ కైవసం