ఏకపక్ష పోరులో ప్రత్యర్థి ఇచ్చిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.5 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత జింబాబ్వే 20 ఓవర్లలో 102/8 స్కోరు మాత్రమే చేసింది. చిపో ముగెరి తిరిపానో (34), కెప్టెన్ జోసెఫిన్ ఎన్కోమో (27 నాటౌట్) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్ నిక్కీ ప్రసాద్ (2/7) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. షఫాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో, చివరి టీ20 మంగళవారం జరుగుతుంది.
భారీ షాట్లతో అలరించిన షఫాలీ తొలి ఓవర్లోనే 4, 6తో తన ఉద్దేశం ఏంటో చెప్పింది. న్యాషా వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో మంధాన కూడా టచ్‌లోకి రాగా, మకుషా బౌలింగ్‌లో షఫాలీ మరోసారి 6,4తో ప్రేక్షకులను అలరించింది. న్యాషా వేసిన ఐదో ఓవర్లో మంధాన అందమైన షాట్లతో వరుసగా నాలుగు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించగా, షఫాలీ కూడా ఓ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఆపై మరింత జోరు పెంచిన షఫాలీ మవుంగ బౌలింగ్‌లో 4, 4, 6తో విరుచుకుపడి పవర్‌ప్లేను 76/0తో ముగించింది. టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక పవర్ ప్లే స్కోరు.
మరోవైపు తానేం తక్కువ కాదన్నట్టు ఏడో ఓవర్లో మంధాన క్రీజు దాటొచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా 85 మీటర్ల భారీ సిక్స్‌తో తన బ్యాట్ పవర్ చూపెట్టింది. బిజా బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న షఫాలీ భారత్‌కు పది వికెట్ల విజయం అందించేలా కనిపించింది. కానీ, తర్వాతి బంతికే మరో షాట్ ఆడి మనుషాకు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో లాంగాఫ్ మీదుగా లాఫ్టెడ్ సిక్స్‌తో మంధాన మ్యాచ్‌కు అద్భుత ముగింపునిచ్చింది.
జింబాబ్వేను మరోసారి తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. కెప్టెన్ జోసెఫిన్, తిరిపానో నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. తిరిపానో కొన్ని బౌండరీలతో ఆకట్టుకుంది. జోసెఫిన్ చివరి వరకూ క్రీజులో నిలిచినా, స్లాగ్ ఓవర్లలోనూ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో జింబాబ్వే అతి కష్టమ్మీద వంద పరుగుల మార్కు దాటింది.

More Stories
ఇస్లాం అనుసరించాలని, ఖురాన్ చదవాలని కోరిన సింబయాసిస్ ప్రొఫెసర్
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు
చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం అందించిన ఓ ఆర్మీ అధికారి భార్య