ఇస్లాం అనుసరించాలని, ఖురాన్ చదవాలని కోరిన సింబయాసిస్ ప్రొఫెసర్ 

* విద్యార్థునులపై అనుచిత సందేశాలు పంపినందుకు సెలవుపై పంపి, విచారణ 
 
సింబయాసిస్ లా స్కూల్ నాగ్‌పూర్ క్యాంపస్‌లోని ఒక ప్రొఫెసర్ విద్యార్థిని ఒకరికి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన సందేశాలు పంపారనే ఆరోపణపై విద్యార్థులు ఆందోళన చేశారు. దానితో ఆమెను మతం మారమని, ఇస్లాంను అనుసరించాలని, ఖురాన్ చదవాలని కోరారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిగే వరకు ఆ ప్రొఫెసర్ ను సెలవుపై పంపుతున్నట్లు విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రకటించింది. 
 
హైదరాబాద్‌లోని సింబయాసిస్ లా స్కూల్‌లో గతంలో ఆయన పనిచేసినప్పుడు ఆయన ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలతో సహా, ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు విశ్వవిద్యాలయం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.   ప్రొఫెసర్ పంపినట్లు ఆరోపిస్తున్న సందేశాలను తన కుమార్తె చూపించడంతో, ఒక విద్యార్థిని తండ్రి విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి)ని ఆశ్రయించారని విహెచ్‌పి సభ్యులు తెలిపారు.
ఆ తర్వాత ఆ సంస్థ ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి, నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్‌ను కలిసింది.  ఈ ఫిర్యాదును యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని, విచారణ జరిపి, తగిన చర్యలు సిఫార్సు చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిందని విశ్వవిద్యాలయ అధికారి ఒకరు తెలిపారు. “విచారణ పూర్తయి, దాని నివేదికలు అందే వరకు సంబంధిత ప్రొఫెసర్ సెలవుపై ఉన్నారు. క్యాంపస్‌కు హాజరుకారు,” అని ఆ అధికారి తెలిపారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఆరోపణలను కూడా కమిటీ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 
 
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 5) నిత్యానంద్ ఝా ప్రకారం, శనివారం ఉదయం సుమారు 11.30 గంటలకు వివిధ సంస్థలకు చెందిన 15-17 మంది విశ్వవిద్యాలయం వద్ద గుమిగూడారు. నిరసనకారులకు, యాజమాన్యానికి మధ్య పోలీసులు చర్చలు జరిపించారు. అనంతరం ప్రొఫెసర్‌ను సెలవుపై పంపారు. సాయంత్రం సుమారు 6.45 గంటలకు, ఫిర్యాదుదారు, ఆమె తండ్రితో పాటు మరో 15-20 మంది బృందం క్యాంపస్‌కు చేరుకుంది.
 
ఇంతలో, విచారణ కమిటీ సుమారు 100-120 మంది విద్యార్థులతో బహిరంగ చర్చ నిర్వహిస్తోంది. ఆ తర్వాత, ఫిర్యాదుదారుతో సహా ఆరుగురు లేదా ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందానికి, యాజమాన్యానికి మధ్య పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆరోపణలను పరిశీలించి, నిర్దేశిత సమయంలోగా చర్యలు తీసుకుంటామని కమిటీ వారికి హామీ ఇచ్చింది. తర్వాత యాజమాన్యం, పోలీసులు విద్యార్థులకు జరిగిన పరిణామాలపై వివరించారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని ఝా తెలిపారు.
 
కాగా, ఆ విద్యార్థిని ఆరోపణలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. నిరసనకారులు కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారంపైకి ఎక్కి, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సదరు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

About The Author