హైదరాబాద్‌ మెట్రోకు ఆరు నెలల్లో రూ.405 కోట్లకు పైగా నష్టం

హైదరాబాద్‌ మెట్రోరైలు ఆర్థిక కష్టాలు కొనసాగుతున్నాయి. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ నుంచి స్వాధీనం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ స్వాధీన ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు మెట్రో ఆదాయం కొంత పెరిగినా ఖర్చులు అంతకంటే ఎక్కువగా ఉండటంతో నష్టాలు మరింత విస్తరిస్తున్నాయి. 2026 సెప్టెంబరు 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు రూ.405.86 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 
 
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.380.46 కోట్ల నష్టం నమోదైంది. అంటే ఏడాది వ్యవధిలో అర్ధ వార్షిక నష్టాలు రూ.25.40 కోట్లు పెరిగాయి. మెట్రో నిర్వహణను ప్రభుత్వం చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆర్థికపరమైన అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల్లో మెట్రోరైలు కార్యకలాపాలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా మొత్తం రూ.524.78 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.497.54 కోట్లతో పోలిస్తే ఆదాయం రూ.27.24 కోట్లు పెరిగింది. 
 
ప్రయాణికుల రవాణా, ఇతర కార్యకలాపాల ద్వారా ఆదాయం పెరిగినప్పటికీ, పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను అధిగమించడానికి అది సరిపోవడం లేదు. ఇదే సమయంలో మెట్రో నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, పరిపాలనా వ్యయాలు, నిర్మాణ సంబంధిత ఖర్చులు, రుణాలపై వడ్డీలు, తరుగుదల కలిపి ప్రస్తుత అర్ధ సంవత్సరంలో రూ.930.64 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయాలు రూ.878 కోట్లుగా ఉన్నాయి. దీంతో ఆదాయం, వ్యయాల మధ్య అంతరం మరింత పెరిగింది.

మెట్రోరైలు ఆర్థిక పరిస్థితిపై రుణాల వడ్డీ భారం తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఫైనాన్స్‌ ఖర్చులు రూ.522.61 కోట్లకు చేరాయి. మరోవైపు మెట్రో రైళ్ల నిర్వహణకు సంబంధించిన ఖర్చులు రూ.222.88 కోట్లుగా నమోదయ్యాయి. మెట్రోకు వస్తున్న ఆదాయంలో గణనీయమైన భాగం రుణాల వడ్డీల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తుంది. దీంతో నిర్వహణ ఆదాయం పెరిగినా మొత్తం ఆర్థిక ఫలితాల్లో మెరుగుదల కనిపించడం లేదు.


మెట్రో మొదటి దశ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలపై ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సగటున 7 నుంచి 8 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా రుణాలను రీషెడ్యూల్‌ చేసి వడ్డీ భారాన్ని తగ్గించాలనేది ప్రభుత్వ వ్యూహంగా ఉంది. వడ్డీ రేటును 3.5 నుంచి 4 శాతం లోపునకు తగ్గించగలిగితే మెట్రో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు ముందుకొచ్చే బ్యాంకుల అన్వేషణ బాధ్యతను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించారు.

ప్రస్తుత అర్ధ వార్షిక గణాంకాల ప్రకారం మెట్రోపై రుణాల వడ్డీ భారం రోజుకు సగటున సుమారు రూ.2.85 కోట్లుగా ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించడంతో పాటు ఆదాయ మార్గాలను పెంచడం, నిర్వహణ వ్యయాలను సమర్థంగా నియంత్రించడం ద్వారా మాత్రమే మెట్రో ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుంది. ప్రభుత్వం స్వాధీన ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తుంది? పునర్వ్యవస్థీకరణకు ఏ మేరకు అనుకూల నిబంధనలు లభిస్తాయన్న అంశాలపై మెట్రో భవిష్యత్తు ఆధారపడి ఉంది.

About The Author