తెలంగాణాలో రోజురోజుకూ పెరుగుతున్న విడాకుల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ఫ్యామిలీ కోర్టుల నివేదిక ప్రకారం 2019 నుంచి 2024 నాటికి విడాకుల కేసులు 33 శాతం పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో విడాకుల పిటిషన్లు పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాల్లో 2019లో సుమారు 4,805 విడాకుల పిటిషన్లు దాఖలవగా, 2024 నాటికి ఈ సంఖ్య 6,406కు చేరింది.
అంటే ఐదేళ్లలో 1,601 పిటిషన్లు పెరిగాయి. ఇది సుమారు 33.3 శాతం వృద్ధిని చూపిస్తుంది.విడాకులకు ఒకే ఒక్క కారణం ఉండదు. విద్య, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత స్వేచ్ఛ, ఉద్యోగ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, మారుతున్న జీవనశైలి వంటి అనేక అంశాలు దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గతంలో కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్తు, సమాజం ఏమనుకుంటుందనే భయంతో చాలామంది తమ సమస్యలను బయటకు చెప్పేవారు కాదు.
ప్రస్తుతం భార్యాభర్తలు పరస్పర గౌరవం, సమానత్వం, భద్రత, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సంబంధంలో నిరంతర వేధింపులు, హింస లేదా తీవ్రమైన విభేదాలు ఎదురైతే విడిపోవడాన్ని కూడా పరిష్కారంగా భావిస్తున్నారు.హైదరాబాద్‌లో ఐటీ, కార్పొరేట్, వైద్య, వ్యాపార రంగాల్లో పనిచేసేవారు ఎక్కువ పని గంటలు, ప్రయాణాలు, లక్ష్యాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, పెద్దల బాధ్యతలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను సమానంగా పంచుకోకపోవడం, ఒకరి కెరీర్‌కు మరొకరు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఆదాయం విషయంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం విభేదాలకు కారణమవుతాయి మరోవైపు స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా కొన్ని సందర్భాల్లో దాంపత్య జీవితంలో అనుమానాలకు కారణమవుతున్నాయి. ఈ ధోరణి అనేక ప్రశ్నలు, అపార్థాలకు దారితీయవచ్చు.
ఫోన్ తనిఖీలు చేయడం, నిఘా పెట్టడం, అవమానించడం వంటి ప్రవర్తనలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధమైనప్పటికీ, కుటుంబాల ప్రభావం కూడా ఉంటుంది. అత్తమామలతో విభేదాలు, తల్లిదండ్రుల మాటకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వేరుగా కాపురం పెట్టాలనే అంశంపై వివాదాలు, ఆస్తి సమస్యలు దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు.
కట్నం కోసం వేధింపులు, శారీరక లేదా మానసిక హింస, మద్యపానం, ఇతర వ్యసనాలు, వివాహేతర సంబంధాలపై వివాదాలు, పిల్లల పెంపకంపై భిన్నాభిప్రాయాలు కూడా కొన్ని సందర్భాల్లో బంధాలను దెబ్బతీస్తాయి. పెళ్లి సంబంధం కుదుర్చుకునే ముందు మంచి అమ్మాయి, మంచి అబ్బాయి, మంచి కుటుంబం అని పరిశీలిస్తుంటారు. అయితే ఈ ‘మంచి’కి అసలైన నిర్వచనం ఏమిటి? ఆస్తిపాస్తులు, హోదా, కుటుంబ నేపథ్యం మాత్రమే కాకుండా వ్యక్తుల స్వభావం, భావోద్వేగ నైపుణ్యాలు, సమస్యలను ఎదుర్కొనే తీరు కూడా ముఖ్యమని కౌన్సిలింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు, భవిష్యత్తుపై అంచనాలు, బాధ్యతల విషయంలో పెళ్లికి ముందే ఇద్దరూ స్పష్టంగా మాట్లాడుకోవాలి. ముందుగా అంగీకరించిన విషయాలకు భిన్నంగా కొత్త అంచనాలను తర్వాత బలవంతంగా రుద్దకూడదు.కోపం వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇతరులను ఎంత గౌరవిస్తున్నారు? అనే విషయాలను నిశితంగా గమనించాలి.
ఒకటి రెండు రోజుల్లోనే సంబంధాన్ని ఖరారు చేయకుండా, వ్యక్తుల ప్రవర్తనను వివిధ సందర్భాల్లో పరిశీలించడం అవసరం. ఇందులో కుటుంబ పెద్దల అనుభవం కూడా కీలకం. పెళ్లికి ముందే అనుమానాలు కలిగినా, సంబంధం కుదిరిపోయిందని, నలుగురికి చెప్పామని వెనక్కి తగ్గడానికి సంకోచించడం సరికాదు. పెళ్లయ్యాక మారుతారనే ఆశతో ముందుకు వెళ్లడం సమస్యలకు దారితీయవచ్చు.
వైవాహిక జీవితంలో మరో వ్యక్తికి చోటివ్వాలంటే సహనం, పరస్పర గౌరవం, భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం అవసరం. కౌన్సిలింగ్‌కు వచ్చే పలువురు పెళ్లికి ముందే అనుమానాలు కలిగాయని చెబుతుంటారు. అందుకే సందేహాలున్నప్పుడు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకోవడమే మంచిది.

More Stories
హైదరాబాద్ మెట్రోకు ఆరు నెలల్లో రూ.405 కోట్లకు పైగా నష్టం
2027 ఎన్నికల్లో యుపిలో యోగి నాయకత్వంలో దూసుకెళ్తున్న బిజెపి
అంబర్‌పేటలో 72 అడుగుల భారీ బతుకమ్మతో సరికొత్త రికార్డు!