ఆలయం వద్ద భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. 15 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన శీతల మాత ఆలయం వద్దకు భారీ లారీ దూసుకురావడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో శీతల మాత ఆలయం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అదే సమయంలో చిన్నిర్‌ వైపు నుంచి ధాన్యంతో వస్తున్న భారీ లారీ కొండవాలు ప్రాంతంలో అకస్మాత్తుగా అదుపు తప్పినట్లు సమాచారం. 
 
ఈ ప్రాంతంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ లారీ అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బారికేడ్లను, చెక్‌పోస్టును ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన వాహనం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆలయ ప్రహరీ గోడ, గేటును బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
 
ఈ ఘటనలో పలువురు లారీ కింద చిక్కుకోవడంతో అక్కడి పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లు, ఇతర వాహనాల్లో సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదు నుంచి ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే గ్వాలియర్‌ కలెక్టర్‌ రుచికా చౌహాన్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ధర్మవీర్‌ సింగ్‌ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 
 
సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను భారీ లారీ ఎలా దాటిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

About The Author