కోల్‌కతాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న చోర్బగన్ సర్బజనీన్ దుర్గా పూజ మండపం వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మహా సప్తమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారాంతం కావడంతో మండపం వద్ద రద్దీ మరింత పెరిగింది. రాత్రి 7.40 గంటల సమయంలో వర్షం మొదలవడంతో బయట వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జనం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది.
మృతులలో ఒక చిన్నారి, 13 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.ఈ ఘటనలో గాయపడిన మరో 35 మందిని కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, సహాయక చర్యలు చేపట్టారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, పూజా పండాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ఆరోగ్యశాఖ మంత్రి శరద్వత్ ముఖర్జీ, ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ తదితర ఉన్నతాధికారులు కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు చికిత్స అందించే ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు ఈ బాధను తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 1800-345-5678 నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. చోర్‌బగాన్ సార్వజనిన్ దుర్గాపూజకు ఈ ఏడాది 91వ సంవత్సరం కావడం గమనార్హం.
మృతుల కుటుంబాలకు ప్రధాని, ముఖ్యమంత్రి పరిహారం ప్రకటన
దుర్గా పూజ పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మహిళలతో సహా కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 25 మంది గాయపడ్డారని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి ఆదివారం తెలిపారు. “ప్రాణాలు కోల్పోయిన 19 కుటుంబాలకు పరిహారం ప్రకటించాం. వారిలో 13 కుటుంబాలతో నేను స్వయంగా మాట్లాడాను. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, అన్ని విధాలా మద్దతునిస్తుందని హామీ ఇచ్చాను” అని తెలిపారు.
“పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2.5 లక్షల పరిహారంతో పాటు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తుంది. అలాగే, గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది. వారికి అదనంగా రూ. 5 లక్షల పరిహారాన్ని కూడా అందిస్తుంది” అని సువేందు అధికారి పేర్కొన్నారు.
ఈ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, కోల్‌కతాలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. “గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం చేస్తోందని ఆయన తెలిపారు. “ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది” అని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
మండపం వద్ద ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఇరుకుగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రవేశ మార్గం వద్ద చాలా సేపటి నుంచి వేచి ఉన్నవారు వర్షం మొదలవడంతో త్వరగా లోపలికి వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో బయట ఉన్న జనమంతా ఒకేసారి కదిలారు. ఈ ప్రభావం మండపం నుంచి బయటకు వెళ్లే మార్గంపై పడింది. ఆ మార్గంలో వెలుతురు కూడా తక్కువగా ఉండటంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తొలుత చిన్న పిల్లలు కిందపడినట్లు సమాచారం. వారిని గమనించేలోపే వెనుక ఉన్నవారు ముందుకు రావడంతో ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

More Stories
2027 ఎన్నికల్లో యుపిలో యోగి నాయకత్వంలో దూసుకెళ్తున్న బిజెపి
జమ్మూ కాశ్మీర్లో, ఇద్దరు అధికారులు, వేర్వేరు మార్గాలు
మాన్సా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకంపై ఎన్ఐఏ, ఈడీ విచారణ జరపాలి