ఇంట‌ర్నెట్ వినియోగం పిల్ల‌ల ప్రాథ‌మిక హ‌క్కు

పిల్లలు ఇంటర్నెట్‌ ను వినియోగించ‌కుండా పూర్తిగా నిరాకరించలేమని పేర్కొంటూ ఇంట‌ర్నెట్ వినియోగం పిల్ల‌ల ప్రాథ‌మిక హ‌క్కు అవుతుంద‌ని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 19(1)(ఏ) కింద ఇంటర్నెట్‌ను వినియోగించుకునే హక్కు ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉందని పేర్కొన్న‌ది. పిల్లల భద్రత పేరుతో వారిని పూర్తిగా ఇంటర్నెట్‌కు దూరం చేయడం సరికాదని సూచించింది.

పిల్లల రక్షణకు, వారి స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం లేదని, రెండింటినీ కాపాడాల్సిన బాధ్యత ఉందని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియా వేదికలు, ఇతర ఆన్‌లైన్‌ సేవల్లో పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీచేసే క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 

బాలల లైంగిక దోపిడీ, దుర్వినియోగ సామగ్రి గురించి భారత అధికారులకు నివేదించడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని ఆరోపిస్తూ, బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’, మరొక దరఖాస్తుదారు దాఖలు చేసిన దరఖాస్తులపై విచారణ జరుగుతుండగా అత్యున్నత న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది. 

ఇంటర్నెట్‌లో భావప్రకటనా స్వేచ్ఛతోపాటు సమాచారాన్ని తెలుసుకునే, పొందే, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఇమిడి ఉందని వివరించింది. ఇంటర్నెట్‌ అనేది ఆలోచనలు, సృజనాత్మకత, సమాచార మార్పిడికి వేదిక అని పేర్కొన్న‌ది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు విద్యా సమాచారాన్ని పొందేందుకు ఇంటర్నెట్‌ ఒక్కటే ప్రధాన మార్గంగా ఉంటోందని తెలిపింది. 

“మన పిల్లల భద్రత, వారి స్వేచ్ఛ ఒకదానికొకటి విరుద్ధం కాదు. మన పిల్లలకు ఈ రెండూ పొందే హక్కు ఉంది,” అని ధర్మాసనం పేర్కొంది.   ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఇతరులతో పరిచయాలు పెంచుకోవడానికి, తమలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో అనుసంధానం కావడానికి కూడా ఆన్‌లైన్‌ వేదికలు ఉపయోగపడతాయని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. 

ప్రస్తుతం ఇంటర్నెట్‌ పిల్లలకు సురక్షితమైన వేదిక కాదని అంగీకరించిన కోర్టు ఆ కారణంతో వారిని పూర్తిగా ఇంట‌ర్నెట్‌కు దూరం పెట్టడం పరిష్కారం కాదని స్పష్టంచేసింది. పిల్లలకు ఇంటర్నెట్ ప్రాప్యతను పూర్తిగా నిరాకరించే బదులుగా, ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడానికి సోషల్ మీడియా ఖాతాలకు ‘చైల్డ్ మోడ్’ను ప్రవేశపెట్టడం వంటి చర్యలను కూడా ధర్మాసనం సూచించింది. 

హానికరమైన కంటెంట్‌ను గుర్తించి, తొలగించడంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు విఫలమయ్యాయనే కారణంతో పిల్లల ప్రాప్యతను పరిమితం చేయడం అంటే, అసలు సమస్యను పరిష్కరించడానికి బదులుగా బాధితులను నిందించడమే అవుతుందని అది పేర్కొంది. అయితే పిల్లల వయసుకు తగిన భద్రతాచర్యలను కోర్టు వ్యతిరేకించలేదు. వీటి అమలుపై తగిన విధానాలను రూపొందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది.  

About The Author