తెలంగాణలో కరవు పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తక్షణ సహాయం కోరింది. రాష్ట్రంలోని 315 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి వివరించారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు సూక్ష్మ సేద్యానికి, మధ్యంతర పంటల విత్తనాల పంపిణీకి తక్షణ ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న తుమ్మల కరవు పరిస్థితుల కారణంగా రైతులు పంటల సాగు, దిగుబడులు, పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నీటి లభ్యత తగ్గిన ప్రాంతాల్లో సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరారు.
రైతులు నష్టాల నుంచి బయటపడేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలోనూ కీలక ప్రతిపాదనలు చేశారు. మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు 100 శాతం మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ధరల మద్దతు పథకం కింద అమలు చేస్తున్న 25 శాతం కొనుగోలు పరిమితిని తొలగించి, రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్, నీటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్మేకర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సహజ వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

More Stories
కాళేశ్వరం మరమ్మతులు చేపట్టాలంటే సాంకేతిక సమస్యలు!
యాదాద్రి పవర్ ప్లాంట్కు బొగ్గు కేటాయింపు.. కేంద్రం పూర్తి అండ
తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటులో మహిళా మోర్చా కీలక పాత్ర