ఈ నెల‌లోనే ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాలు?

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న బిల్లు, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుల‌ను పాస్ చేసేందుకు త‌మ వ‌ద్ద సంఖ్యా బ‌లం ఉన్న‌ట్లు కేంద్రం విశ్వ‌సిస్తున్న‌ది. ఈ బిల్లుల ఆమోదం కోసం డీఎంకేతో పాటు చిన్న పార్టీల‌ను కూడా ఆశ్ర‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు కీల‌క బిల్లుల‌ను పాస్ చేసేందుకు ఈనెల‌లోనే ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని కేంద్రం యోచిస్తున్న‌ట్లు ఓ మీడియా సంస్థ క‌థ‌నం ద్వారా వెల్ల‌డైంది. 

మ‌రో వైపు విప‌క్షాలు మాత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స‌ర్ ప్ర‌క్రియ‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. డీలిమిటేష‌న్‌, వుమెన్స్ కోటా బిల్లుల‌ను ఆమోదింప‌చేసేందుకు కావాల్సిన సంఖ్యా బ‌లం త‌మ వ‌ద్ద ఉన్న‌ట్లు కేంద్రం భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ రెండు బిల్లుల‌కు చెందిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు జ‌ట్కా త‌గిలిన విష‌యం తెలిసిందే.

 గత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏప్రిల్ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడిన నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో ప్రభుత్వానికిఎదురుదెబ్బ తగిలింది. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదం, విద్యార్థుల నిరసనలపై చర్యలకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ముందుకు సాగలేదు. 

రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ద‌క్కాలంటే పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక మెజారిటీ అవ‌స‌రం అవుతుంది. ప్ర‌స్తుత లోక్‌స‌భ‌లో ఎన్డీఏకు మూడో వంతు మెజారిటీ లేక‌పోవ‌డం స‌మ‌స్య‌గా మారింది.  సుమారు 360 మంది ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. రెండు బిల్లుల‌ను పాస్ చేసేందుకు డీఎంకే స‌హాయాన్ని కేంద్రం కోర‌నున్న‌ది. త‌మిళ‌నాడులో కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన విష‌యం తెలిసిందే. ఇక ఇండియా కూట‌మి నుంచి కూడా ఎండీకే వైదొలిగింది. చిన్న చిన్న విప‌క్ష పార్టీల‌తోనూ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నది.  

మరోవంక, కొత్త నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలని  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. గతంలో చేసిన విధంగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో బలవంతంగా ఆమోదింపజేసుకునే ప్రయత్నం మరోసారి చేయొద్దని  కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖను వ్రాసారు. 

ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసి ఇప్పటికే 64 రోజులు గడిచినా, పార్లమెంట్ ఉభయ సభలను ఇంకా వాయిదా వేయలేదని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఖర్గే లేఖ రాసినట్లు తెలుస్తోంది.

About The Author