తెలంగాణ బిడ్డగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ కొరత రాకుండా యాదాద్రి ప్లాంట్‌కు తప్పకుండా బొగ్గు సరఫరా చేస్తామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో ఫోన్లో మాట్లాడారని కిషన్ రెడ్డి వెల్లడించారు. సింగరేణిలో ఉత్పత్తి తగ్గడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా కోల్ ఇండియా నుంచి బొగ్గు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారని ఆయన తెలిపారు.
ఈ మేరకు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని, మహానది కోల్ ఫీల్డ్స్ లేదా వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి లింకేజీలను వర్కవుట్ చేసి తక్షణమే బొగ్గు అందిస్తామని స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తనను కలిసి ఖమ్మం జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్, సింగరేణి అభివృద్ధి అంశాలపై చర్చించారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా హైడ్రో పవర్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని, మరోవైపు విద్యుత్ డిమాండ్ 16 నుంచి 18 శాతం పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో 74 శాతంగా ఉన్న థర్మల్ విద్యుత్ ఆధారపడటం నేడు 83 శాతానికి చేరిందని, దీంతో బొగ్గు రంగంపై తీవ్ర భారం పడిందని చెప్పారు. రైల్వే శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, తానూ స్వయంగా సమీక్షించి సరఫరాను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు .
సాధారణంగా రోజుకు 350 రైల్వే రేక్స్ బొగ్గును లోడ్ చేసే స్థానంలో రికార్డు స్థాయిలో 496 రేక్స్ లోడ్ చేసి పవర్ ప్లాంట్లకు తరలిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బొగ్గు ఉత్పత్తి, రవాణా, పవర్ ప్లాంట్లలో నిల్వలను సమీక్షిస్తున్నారని వెల్లడించా యిరు. కోల్ ఇండియా పరిధిలోని 4 లక్షల మంది కార్మికులకు ప్రోత్సాహకాలు అందిస్తూ సెలవుల్లోనూ ఉత్పత్తి సాగేలా చూస్తున్నామని, సంక్షోభం నుంచి బయటపడి దేశంలోని థర్మల్ ప్లాంట్లను సమర్థవంతంగా నడుపుతున్నామని వివరించారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల విద్యుత్, నీటి కొరత ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలబడాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నదాతల పుణ్యమా అని దేశంలో ఎక్కడా ఆహార ధాన్యాల కొరత లేదని, రాబోయే ఏడాది కాలం పాటు దేశ ప్రజలందరికీ తిండి పెట్టే నిల్వలు ఎఫ్ సీఐ గోడౌన్లలో సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.32,000 కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో కొన్న బియ్యం ఎక్కడున్నాయో చెప్పకుండా, ఉత్పత్తి అయిన సన్న బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ, కేంద్రంపై నెపం నెట్టాలని చూడటం రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
సింగరేణిలో 46 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి స్పష్టతనిచ్చారు. బొగ్గు శాఖ మంత్రిగా, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా తాను వాస్తవాలే మాట్లాడతానని, అక్కడ బొగ్గు దొంగతనం జరగలేదని, అధికారుల ‘బుక్ అడ్జస్ట్మెంట్’లో జరిగిన తప్పిదం మాత్రమేనని తేల్చిచెప్పారు. సంబంధిత అధికారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారని తెలిపారు. రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.
సింగరేణి సంస్థను సంక్షోభంలోకి నెట్టింది ముమ్మాటికీ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలేనని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి థర్మల్ పవర్, సింగరేణి బొగ్గును రాష్ట్ర జెన్కో వాడుకుంటూ బిల్లులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి సింగరేణికి రూ.26,000 కోట్ల నుంచి రూ.29,000 కోట్ల బకాయిలు పెట్టిపోతే, అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ బకాయిలను ఏకంగా రూ.59,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పథకాలకు నిధులు కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసే సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. సింగరేణి సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత, 15 సంవత్సరాల అనంతరం సింగరేణికి కొత్తగా 3 కోల్ బ్లాక్‌లను కేటాయించామని, మరో బ్లాక్ కేటాయింపు కోసం కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు.

More Stories
భారత్‌పై గూఢచర్య బడ్జెట్‌ను రూ. 1,300 కోట్లకు పెంచిన ఐఎస్ఐ
రాజ్యాంగ వ్యవస్థపై నిరంతరం దాడులతో కాంగ్రెస్ నాలుగో చారిత్రక తప్పిదం
నిరసనలను సమయంలో జర్నలిస్టులకు ప్రెస్ కౌన్సిల్ మార్గదర్శకాలు