టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయాస్‌

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు ఎగబాకాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అదరగొడుతున్న సర్పంచ్ సాబ్ ఓవరాల్‌గా నాలుగో ర్యాంక్‌లో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ అందుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ నెంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతుండగా, అభిషేక్‌ శర్మ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. షాహిబ్జాదా ఫర్హాన్‌ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. తాజా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది.
ఇషాన్‌ కిషన్(904 పాయింట్లు)‌ అగ్రస్థానంలో ఉండగా, అభిషేక్‌ శర్మ(891 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రేయస్‌తో సహా టాప్‌-4లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. పాకిస్థాన్‌ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్(883 పాయింట్లు)‌ మూడో స్థానంలో ఉన్నాడు.  మరోవైపు స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా తాజాగా ర్యాంకింగ్స్‌లో భారీ పురోగతి సాధించాడు. 731 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
వెస్టిండీస్‌ బ్యాటర్‌ షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ 13 స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 24వ స్థానంలో నిలిచాడు. భారత వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌ నాలుగు స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 27వ ర్యాంకును అందుకున్నాడు. భారత్‌పై చెలరేగిన వెస్టిండీస్‌ ప్లేయర్ రోస్టన్‌ చేజ్‌ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 24 స్థానాలు మెరుగుపరుచుకుని 23వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకును అందుకున్నాడు.
వెస్టిండీస్ సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా(637 పాయింట్లు) 11వ స్థానానికి పడిపోయాడు.  విండీస్‌పై అంతగా ప్రభావం చూపలేకపోతున్న అక్షర్ పటేల్(649 పాయింట్లు) తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. టాప్ బౌలర్‌గా కొనసాగిన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 632 పాయింట్లతో ఏకంగా 15వ స్థానానికి పడిపోయాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్‌ ఆటగాడు రవీంద్ర జడేజా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. 422 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బ్యాటర్‌ మాథ్యూ రెన్‌షా తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతడు టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-100 వెలుపలి నుంచి సంయుక్తంగా 49వ స్థానానికి చేరుకున్నాడు.

About The Author