* సంక్షేమ వసతి గృహాల్లో రూ.800 కోట్ల కుంభకోణం
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ (ఎస్సీ) వసతి గృహాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఎస్సీ హాస్టళ్ల నిర్వహణ పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పెద్ద మాఫియా నడుస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ హాస్టళ్ల స్థితిగతులపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మేధావులు, రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన చారిత్రక కాచిగూడ ఎస్సీ హాస్టల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2020 కరోనా కాలం నుంచి మూతపడి శిథిలావస్థకు చేరిందని గుర్తుచేశారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ హాస్టల్ను పునరుద్ధరించకపోవడం దారుణమని విమర్శించారు.
ఆ హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులను కాంగ్రెస్ నాయకులకు చెందిన ప్రైవేట్ భవనాల్లోకి తరలించి, ఒక్కో భవనానికి నెలకు రూ.5 లక్షల వరకు అద్దెలు చెల్లిస్తూ తమ పార్టీ కార్యకర్తలకు మేత వేస్తున్నారని, ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో హాస్టల్ పూర్వ విద్యార్థులు, జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసీ) నాయకులు సీఎంను కలిసి విన్నవించగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే ఇదే హాస్టల్ రూమ్ నెంబర్ 33లో ఉండి చదువుకున్నానని చెప్పుకునే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లతో కూడిన ప్రభుత్వ బృందం కాచిగూడ హాస్టల్ను సందర్శించిందని గుర్తుచేశారు.
ఆ శిథిల భవనాన్ని కూల్చేసి రూ.30 కోట్లతో నూతన భవనం నిర్మిస్తామని స్వయంగా డిప్యూటీ సీఎం వాగ్దానం చేసి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ నయాపైసా కేటాయించలేదని ధ్వజమెత్తారు. అసలు వీరు ప్రకటించిన రూ.30 కోట్లు ఆ పాత భవనాన్ని కూల్చడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు.
ఎస్సీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేసి కాచిగూడ హాస్టల్ నిర్మాణానికి నిధులు సాధించాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం ప్రైవేట్ భవనాల్లో తలదాచుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు, బాత్రూమ్లు, నాణ్యమైన భోజనం, చలికాలంలో కప్పుకోవడానికి సరైన దుప్పట్లు, స్నానానికి బకెట్లు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్కు వెనుక ఉన్న స్థలంతో కలిపి మొత్తం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో అత్యాధునిక హంగులతో కూడిన లర్నింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, నాణ్యమైన భోజన వసతితో కూడిన భారీ భవన సముదాయ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే రూ.100 కోట్లు కేటాయించాలని కాంతి కిరణ్ డిమాండ్ చేశారు. అలాగే తాత్కాలికంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టళ్లలో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం పోషకాహారం, దుప్పట్లు, దినపత్రికలు, టీవీ, ఇంటర్నెట్ సౌకర్యాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ఎస్సీ హాస్టళ్లపై సమగ్ర అధ్యయనం చేసి త్వరలోనే బీజేపీ ఎస్సీ మోర్చా తరఫున ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, ఎస్సీ యువత భవిష్యత్తు కోసం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని, విద్యార్థుల హక్కులు సాధించేవరకు బీజేపీ పోరాటం ఆగదని హెచ్చరించారు.
More Stories
టెండర్లు, బిల్లులు పొందాలంటే సీఎంకు 15 శాతం కమీషన్
అమెరికా హిందూ ఆలయంపై కాల్పులకు రెండేళ్లుగా ప్రయత్నం!
నేహా బోరా ‘బంగ్లాదేశ్ మార్గం చూపింది’ వ్యాఖ్యలపై దుమారం