రక్షణ దళాల కోసం ‘భారత్‌ రైస్’‌

రక్షణ దళాల కోసం ‘భారత్‌ రైస్’ను ఇండియన్‌ ఆర్మీ లాంఛనంగా ప్రారంభించింది. సైనికుల రేషన్‌ నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ‘భారత్‌ రైస్’ సేకరణ, పంపిణీ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)తో ఆర్మీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
‘ఈ అత్యుత్తమ నాణ్యత గల బియ్యాన్ని, స్థానిక ఎఫ్‌సీఐ కేంద్రాల నుంచి ఆర్మీ డిపోలు సేకరించడానికి బదులుగా లడఖ్, ఈశాన్య ప్రాంతాలతో సహా అన్ని ఆర్మీ సరఫరా డిపోలకు నేరుగా పంపిణీ జరుగుతుంది’ అని అధికార ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బియ్యాన్ని మిల్లింగ్ చేసి, నాఫెడ్ ద్వారా సరఫరా చేస్తారని వెల్లడించారు.
సైనికుల కార్యాచరణ సంసిద్ధత కేవలం ఆయుధాలతోనే నిర్వచించలేమని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సందర్భంగా తెలిపారు. అత్యంత కఠినమైన పరిస్థితులలో పనిచేస్తున్నప్పుడు వారి శారీరక, మానసిక ఆరోగ్యం, మనోధైర్యం, ఓర్పుపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందుకే సైనికుల సంక్షేమం ఒక అప్రధానమైన విషయం కాదని, జాతీయ భద్రతలో అది అంతర్భాగమని పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం, పటిష్టమైన పరికరాలు, సంపూర్ణ శిక్షణ సైనికుల మనోధైర్యాన్ని పెంచుతుందని, ప్రతి సవాలును వారు ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాయని ఆయన వివరించారు. ఆధునిక యుద్ధ తంత్రంలో ఆయుధాలు, యుద్ధ వేదికలు, సాంకేతికత మాత్రమే కీలకమైన అంశాలు కావని, సరఫరా మరియు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) కూడా ఒక యుద్ధ శక్తియేనని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు.కాగా, కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల కిందటే ‘భారత్’ బ్రాండ్ ఉత్పత్తులను ప్రారంభించింది. ఇప్పటికే సాధారణ ప్రజల కోసం ప్యాక్ చేసిన సబ్సిడీ బియ్యాన్ని ‘భారత్‌ రైస్’ పేరుతో అమ్మడం ప్రారంభించింది. అలాగే ‘భారత్ ఆటా’ ‘భారత్ దాల్‌’ బ్రాండ్లను కూడా విక్రయిస్తోంది.

About The Author