ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మణిపూర్‌లోని మూడు కొండ ప్రాంత జిల్లాలైన కామ్‌జోంగ్, ఉఖ్రుల్, కాంగ్‌పోక్‌పిలలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగా, కుకీ వర్గాల మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో ఒక మహిళతో సహా మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ మరణాలు శుక్రవారం, శనివారాల్లో నమోదయ్యాయి. మృతులలో ఆరుగురు నాగాలు, ఇద్దరు కుకీలు, ఒక గూర్ఖా రైతు ఉన్నారు.
దీంతో ఈ ఏడాది మణిపూర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటనలలో ఇది ఒకటిగా నిలిచింది. అయితే, ఆదివారం నాడు ఆ మూడు కొండ జిల్లాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, పౌరులందరి భద్రతను నిర్ధారించడానికి తక్షణ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే, వివిధ వర్గాలకు చెందిన ప్రజా నాయకులు, పౌర సమాజ సంస్థలు ముందుకు వచ్చి, సంయమనం పాటించాలని మరియు ఉద్రిక్తతను తగ్గించడంలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతి, చర్చలు, సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సమాజంలోని అన్ని వర్గాలను కోరారు. హింసాత్మక ఘటనలు మరింత పెరగకుండా నిరోధించేందుకు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) సిబ్బంది, మణిపూర్ పోలీసులతో కూడిన భద్రతా దళాలు ఆ మూడు జిల్లాల్లో గస్తీ, సోదాలను ముమ్మరం చేశాయని అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి కామ్‌జోంగ్ జిల్లాలోని చస్సాద్ గ్రామంలో 42 ఏళ్ల మహిళ హత్యకు గురైన తర్వాత ఈ తాజా హింస చెలరేగింది. ఆ జిల్లాలో నాగా జనాభా అధికంగా ఉన్నప్పటికీ, చస్సాద్ మాత్రం కుకీలు ఎక్కువగా నివసించే గ్రామం కావడం గమనార్హం. ఐదుగురు పిల్లల తల్లైన ఆమెను డోమ్‌ఖోనీ టౌథాంగ్‌గా గుర్తించారు. ఆమె మెడ భాగంలో తుపాకీ గుండు తగలడంతో కొద్ది నిమిషాల్లోనే మరణించిందని ఇంఫాల్‌లోని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఆమె హత్యతో కుకీ, నాగా వర్గాలకు చెందిన సాయుధ బృందాల మధ్య కాల్పులు చెలరేగాయి. ఈ కాల్పులు శనివారం కూడా కొనసాగాయి. కమ్‌జోంగ్, ఉర్‌ఖల్ జిల్లాలో శనివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో నివాసాలు, దుకాణాలకు నిప్పంటించగా కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్‌లో ఇటీవల నాగాలు, కుకి-జో వర్గాల మధ్య హింస చెలరేగడంతో గిరిజన ఐక్యతా కమిటీ (సీఓటియు) శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కాంగ్‌పోక్పి జిల్లా వ్యాప్తంగా 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
ఆ జిల్లాలోని చస్సాద్‌లో శనివారం ఉదయం సాయుధ బృందాలుగా అనుమానిస్తున్న వారు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 23 ఏళ్ల మైఖేల్ న్గామిన్లెన్ హావోకిప్ అనే యువకుడు మృతిచెందాడు. ఉఖ్రుల్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో టీఎం కాసోమ్ సమీపంలోని యావోలెన్ వద్ద సందీప్ రాయ్ అనే 40 ఏళ్ల వ్యక్తి నడుపుతోన్న కారుపై సాయుధులుగా అనుమానిస్తున్న వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చస్సాద్‌లో శుక్రవారం రాత్రి కుకీ తెగకు చెందిన డోమ్‌ఖోనీ టౌతాంగ్ అనే మహిళ హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఈ రెండు ఘటనలు సంభవించాయి. ఇదిలా ఉండగా, కామ్‌జాంగ్ జిల్లాలోని మణిపూర్-మయన్మార్ సరిహద్దులో ఉన్న నింగ్‌చౌ గ్రామంలో శనివారం ఉదయం ఇద్దరు నాగా గ్రామస్థులను తుపాకీతో కాల్చి చంపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. మృతులను న్గాచాన్సో నింగ్‌షెన్ (35), లీషిషన్ లీషాడాంగ్ (48)గా గుర్తించారు.
కాల్పులకు దారితీసిన పరిస్థితులు, దాడి చేసిన వారి గుర్తింపుకు సంబంధించిన వివరాలు తక్షణమే అందుబాటులోకి రాలేదు. తాజా ఘటనతో మరణాల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో నలుగురు కామ్‌జాంగ్ జిల్లాలో.. ఒకరు పొరుగున ఉన్న ఉఖ్రుల్ జిల్లాలో చనిపోయారు. శనివారం చస్సాద్, దాని పరిసర ప్రాంతాల్లో కనీసం 10 ఇళ్లకు, 20 దుకాణాలకు కూడా నిప్పు పెట్టారు. అయితే, నష్టం తీవ్రత, ఎంత మంది నిరాశ్రయులయ్యారనేది స్పష్టంగా తెలియరాలేదు.
ఈ ఘటనలతో చస్సాద్ పోలీస్ గేట్ జంక్షన్ వద్ద 400 మీటర్ల పరిధిలోని 144 సెక్షన్ విధించారు. కామ్‌జోంగ్ జిల్లాలోని చస్సాద్, ఉఖ్రుల్ జిల్లాలోని యావోలెన్, అలాగే ఇంఫాల్-తెంగ్నౌపాల్ రహదారిపై జరిగిన వరుస దాడులను నిరసిస్తూ సదర్ హిల్స్ సిఓటియు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కాంగ్‌పోక్పి జిల్లా వ్యాప్తంగా 24 గంటల సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ నుంచి అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఇచ్చారు.
మణిపూర్‌లో రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే జరిగిన వేర్వేరు హింసాత్మక ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాలను తన పోస్ట్‌లో బీరెన్ సింగ్ ఎత్తిచూపారు.
పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారుల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘సాయుధ ముఠాలు సామాన్య పౌరులను చంపుతూ, పోలీస్ స్టేషన్లను తగలబెడుతూ, దేశ సార్వభౌమాధికారానికే సవాల్ విసురుతుంటే చూస్తూ ఊరుకోకూడదు’’ అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారకముందే తక్షణమే చర్యలు తీసుకోవాలని బీరెన్ సింగ్ డిమాండ్ చేశారు.

More Stories
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు బ్రేక్
ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య హక్కులు, తెలంగాణలో బీజేపీకి నిర్బంధాలా?
300 మంది కెనడా వాణిజ్యవేత్తలు బృందం భారత్ లో పర్యటన