* మూక పాలనపై ప్రజాస్వామ్యం విజయం.. బిజెపి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) నిరసన నేపథ్యంలో రాజధాని ప్రాంతం భారీ భద్రతా వలయంలోకి మారగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజధానిలో అశాంతిని ప్రేరేపిస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లపై ఆరోపణలు గుప్పించారు; పరిస్థితిని కేంద్రం తగిన విధంగా ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరించారు.
సిజెపి నిరసనకు ముందు మీడియాతో మాట్లాడుతూ ‘అర్బన్ నక్సల్స్’గా వ్యవహరిస్తున్న వీరు, “కొన్ని విదేశీ శక్తుల ఆదేశాల మేరకు” రాజధానిలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిజెపికి ఆప్ మద్దతు ఉందని పేర్కొన్న ఆయన, ‘ఇండియా’ కూటమి నాయకుల మాటలతో భారత యువత తప్పుదోవ పట్టదని స్పష్టం చేశారు.
“నేడు దేశంలో అత్యంత ప్రమాదకరమైన, తీవ్రమైన పరిస్థితిని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. 140 కోట్ల మంది ప్రజలు శాంతియుతంగా, సామరస్యంతో జీవిస్తూ భారతదేశ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తున్న తరుణంలో, దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి,” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్త సంక్షోభం ఉన్నప్పటికీ భారతదేశం పురోగమిస్తూనే ఉండటాన్ని, అలాగే ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో పదేపదే విఫలమవడాన్ని ప్రతిపక్ష నాయకులు “జీర్ణించుకోలేకపోతున్నారని” ఆయన పేర్కొన్నారు.
గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తుచేస్తూ, భారత ప్రజాస్వామ్యానికి అపారమైన శక్తి ఉందని, ప్రతిపక్షాల ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతాయని నబిన్ స్పష్టం చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజలకు సేవ చేయడం కోసం బీజేపీ, మోదీ ప్రభుత్వం తమ కృషిని కొనసాగిస్తాయని నబిన్ పునరుద్ఘాటించారు. “దేశంలో ఎవరు ఎక్కువ అస్థిరతను సృష్టించగలరని పోటీ పడుతూ మీరు చేస్తున్న ‘అరాచక పోటీ’ విజయవంతం కాదు. ప్రజలు ఇప్పటికే తిరస్కరించిన వ్యక్తులు వీరు,” అని నబిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఆ తీర్పును అంగీకరించడం లేదా దాని నుండి పాఠాలు నేర్చుకోవడం మానేసి, దేశాన్ని అస్థిరపరిచేందుకు మీరు కుట్ర పన్నారు. మీ రాజకీయ ఎజెండాల కోసం, విదేశీ శక్తుల ఆదేశాల మేరకు మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను” అని విమర్శించారు.
కాగా, జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనను రాజధానిలో అశాంతిని సృష్టించేందుకు ప్రతిపక్ష శక్తులు చేసిన ప్రయత్నమని బీజేపీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర అభివర్ణించారు. ఈ నిరసన దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టడం లేదని పేర్కొన్న ఆయన, “మూక పాలన”పై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఉద్ఘాటించారు.
“జంతర్ మంతర్ కథనం భారతదేశ కథనం కాదు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నది, టీవీలు, కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో కనిపిస్తున్నది భారతదేశ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు. భారతదేశం ప్రశాంతంగా ఉంది. సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోంది,” అని పాత్ర పేర్కొన్నారు. దేశ రాజధానిని తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి (బంధీగా ఉంచడానికి) నిరసనకారులు ప్రయత్నించారని ఆరోపించిన పాత్ర, అక్కడ అల్లర్లు, హింసను ప్రేరేపించే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. “కానీ ఈ రోజు, ‘భీడ్‌తంత్ర’ (మూక పాలన) పై ప్రజాస్వామ్యం విజయం సాధించింది,” అని ఆయన చెప్పారు.
భారత రాష్ట్రపతితో సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పాత్ర లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఆ సమావేశాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ నేత గాంధీని “అసమర్థ నాయకుడు” (నలాయక్ నేత) అని అభివర్ణించారు, అలాగే రాష్ట్రపతిని వీధి పోరాటాల్లోకి లాగడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు చేశారు.
“రాష్ట్రపతిని వీధి పోరాటంలోకి లాగడానికి ఇంతకు ముందెన్నడూ ప్రయత్నం జరగలేదు. కానీ ఒక ‘అసమర్థ నాయకుడు’ అలా చేయడానికి ప్రయత్నించారు,” అని పాత్ర మండిపడ్డారు. గాంధీ రాష్ట్రపతిని అరాచకంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

More Stories
పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే
స్టార్‌లింక్ ఆలస్యం వెనుక భద్రతా సమస్యలు?
ఓటు చోరీపై ఆధారాలు ఇవ్వాలని కోరిన రాష్ట్రపతి ముర్ము