శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రయాణిస్తున్న విమానంలోకి ఢిల్లీ పోలీసుల బృందం ప్రవేశించింది. జంతర్ మంతర్ వద్ద సిజెపి తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ముందు, విమానంలోనే ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు దిప్కేను అదుపులోకి తీసుకున్నారు. దిప్కేతో పాటు, సిజెపి సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబర్ ధృవ్ రాఠీ, సిజెపి లీగల్ సెల్ అధినేత రత్న సింగ్‌లను వారి నివాసాల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న గంట వ్యవధిలోనే దిప్కేను కూడా అదుపులోకి తీసుకున్నారు. విమానంలోనే దిప్కేతో పాటు ఇతర సిజెపి సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలతో కూడిన వీడియోను దిప్కే స్వయంగా పోస్ట్ చేశారు. విమానం దిగే వరకు పోలీసులు ఎందుకు వేచి ఉండలేకపోయారని సిజెపి సభ్యులు ప్రశ్నించడంతో విమానం లోపల గందరగోళం నెలకొన్నట్లు ఆ వీడియోలో కనిపించింది.
“మేము బయటకు వచ్చే వరకు మీరు వేచి ఉండవచ్చు కదా. రండి, మమ్మల్ని అరెస్టు చేయండి, మాకు భయం లేదు,” అని విమానంలోకి వచ్చిన మహిళా పోలీసులతో దిప్కే అనడం అందులో వినిపించింది. అనంతరం, పోలీసులు ఆ సిజెపి నాయకులను విమానాశ్రయం నుండి అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.
రాజధాని అంతటా భద్రతను కట్టుదిట్టం చేసి, నిరసన కార్యక్రమానికి ముందే సుమారు 1,500 మందిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాలు, విధానపరమైన నిబంధనలను సాకుగా చూపి, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు సిజెపికి ఢిల్లీ పోలీసులు ఇదివరకే అనుమతి నిరాకరించారు. రాజధానిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పేర్కొంటూ, ఆ ఆంక్షలను పాటించాలని ప్రజలకు సూచించారు.
నిరసనకారుల కదలికలను అడ్డుకునేందుకు 45 మెట్రో స్టేషన్లను మూసివేయడం, డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేయడంతోపాటు కేంద్రం 20,000 మందికి పైగా పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని మోహరించింది. ఢిల్లీ పోలీసులు ముఖ గుర్తింపు వ్యవస్థలు, బాడీ కెమెరాలు, సీసీటీవీ నిఘా, డ్రోన్లు, పైకప్పులపై గస్తీ కాసేవారితో సహా పలు కఠినమైన చర్యలను అమలు చేస్తున్నారు.
నిరసన కోసం మోహరించిన ఢిల్లీ పోలీసు సిబ్బంది యూనిఫామ్‌లపై బాడీ కెమెరాలను అమర్చారు. నిరసనకారుల మధ్య సంభాషణలను రికార్డ్ చేయడానికి ఉద్దేశించారు. నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చిన సంస్థల సభ్యులను అడ్డుకోవడానికి ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా తనిఖీలను గణనీయంగా ముమ్మరం చేసినట్లు దక్షిణ జిల్లా డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు.

More Stories
ఓటు చోరీపై ఆధారాలు ఇవ్వాలని కోరిన రాష్ట్రపతి ముర్ము
`లైంగిక వేధింపుల’పై కాంగ్రెస్ ఎంపీ అకోయిజామ్ను తొలగించిన జేఎన్యూ
ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హావా.. బీజేపీకి మరో లోక్ సభ సీట్!