యూపీఐపై ఎండీఆర్ ఛార్జీల అమలు వాయిదా?

యూపీఐ  ద్వారా జరిగే రూ.2000పైన లావాదేవీలపై ప్రతిపాదించిన ఛార్జీల‌ అమలును కొన్ని నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న‌ట్లు సమాచారం. ఇప్పుడు పండగల సీజన్‌ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తున్న‌ది. దీనిపై త్వరలోనే అధికారికంగా స్పష్టతవచ్చే అవకాశం ఉన్న‌ది. 

రూ.2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీల‌ను అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. అయితే ఈ గడువును వచ్చే ఏడాది జనవరి వరకు పొడిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న‌ది. ఈ నిర్ణయంవల్ల పేమెంట్ కంపెనీలు తమ సాంకేతిక వ్యవస్థలను ఆధునికీకరించుకోవడానికి సమయం దొరుకుంది.

అదేవిధంగా పండగల‌ సీజన్‌లో వ్యాపారులపై అదనపు ఛార్జీల భారం పడకుండా ఉంటుంది. కాగా ఆరేళ్లకు పైగా ఎలాంటి రుసుము లేకుండా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపులపై ఈ ఛార్జీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇది వినియోగదారులకు ప్రత్యక్షంగా వర్తించదు. ఇది వ్యాపారులవైపు నుంచి చెల్లించాల్సిన ఇంటర్‌ఛేంజ్ రుసుము. ప్రస్తుతం దేశంలో 50 కోట్లకుపైగా యూపీఐ వినియోగదారులు ఉన్నారు.

ఆగస్టు 2026 లోనే యూపీఐ ద్వారా రూ.29.82 లక్షల కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయంటే దీని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి ఛార్జీల అమలు మొదలుపెడితే అది దసరా, దీపావళి వంటి పండగల వేళ‌ వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.  ఈ కీలక సమయంలో రిటైల్ చెల్లింపులకు అంతరాయం కలుగకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం.

అదే సమయంలో ఈ అదనపు గడువులో పేమెంట్ కంపెనీలు తమ సాంకేతిక వ్యవస్థలను మెరుగుపరుచుకోవడానికి, ఛార్జీల భారాన్ని వినియోగదారులపై పడకుండా ఎలా సర్దుబాటు చేయాలో ప్రణాళిక రచించుకోవడానికి సమయం లభించ‌నుంది. ఇటీవల పలు వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్, పేమెంట్ కంపెనీలు కూడా ఈ యూపీఐ ఎండీఆర్ ఛార్జీల విధానాన్ని 2027 జనవరికి వాయిదా వేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (ఎన్పీసీఐ) కోరినట్లు సమాచారం.

ఎండీఆర్ రేట్లు, ట్రాన్సాక్షన్స్ వర్గీకరణపై గందరగోళమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు పలు ఆంగ్ల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఎన్పీసీఐ కేంద్ర ఆర్థిక శాఖ మధ్య చర్చలు జరుగుతున్నాయని, రాబోయే 1-2 రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది

About The Author