బుధవారం న్యూఢిల్లీలో సీఈసీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారిని తోశారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ, “రీల్ చేయాలనే ఆత్రుతలో రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారిని తోయడానికి ప్రయత్నించారు” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆమె తన మోచేతితో ఒక మహిళా పోలీసు అధికారిని తోస్తున్నట్లు కనిపిస్తోంది. గాంధీ చర్యను బీజేపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ అరుణ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేస్తూ, “రాజకీయాలు హద్దులు దాటినప్పుడు: ప్రియాంక గాంధీ ఒక మహిళా పోలీసు అధికారిని మోచేతితో తోస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ శిబిరం నుండి సిగ్గుచేటైన దృశ్యాలు” అని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా, జాతీయ రాజధానిలో బుధవారం జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసు సిబ్బందిపై దాడి చేశారని, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై ఢిల్లీ పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులపై దాడి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, సిబ్బందిని తోసివేయడం, దుర్భాషలాడటం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
ప్రదర్శన సందర్భంగా జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ కేసు నమోదు చేశారని, పోలీసులు ఆరోపణలను, ఇందులో ప్రమేయం ఉన్నవారి పాత్రలను పరిశీలిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా పలువురు ఎంపీలు, ప్రతిపక్ష నాయకులతో సహా 91 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా బ్లాక్ నాయకులు మరో రోజు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ప్రతిపక్ష ఎంపీలు మధ్యాహ్నం విందు సమావేశం నుండి బస్సుల ఊరేగింపులో జంతర్ మంతర్ సమీపానికి చేరుకుని ఆకస్మికంగా ధర్నాకు దిగారు. అయితే, వరుసగా రెండో రోజు కూడా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన నిరసనను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని, గాంధీతో పాటు పలువురు ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
“(ప్రధాన ఎన్నికల కమిషనర్) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు మేము నిరసన ఆపబోము. ఇది ఈ దేశంలో అత్యంత పవిత్రమైన దానిని కాపాడటానికి చేస్తున్న పోరాటం. మమ్మల్ని ఆపడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ఏమీ చేయలేరు,” అని గాంధీ స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన బస్సు ఊరేగింపు, ఆ తర్వాత షాంగ్రి-లా హోటల్ ముందున్న రౌండ్అబౌట్లో ఆకస్మికంగా చేపట్టిన ధర్నాలో అనేక నాటకీయ ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
భద్రతా సిబ్బంది ప్రతిపక్ష ఎంపీలను అడ్డుకోగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర మహిళా నాయకులు రాజ్యాంగ ప్రతులను చేతబూని రోడ్డుపై పడుకున్నారు.

More Stories
`ఓట్ల చోరీ’ ఆరోపణలు ఆధార రహిత ప్రచారం
రాహుల్ `అరాచకవాది’, విషం చిమ్ముతున్న ప్రతిపక్షాలు
బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో పర్యటించిన హమాస్ అగ్రశ్రేణి కమాండర్లు