ఫ్లైదుబాయ్ హీరో స్మిత్ మచ్చర్ పుర్రెకు పగుళ్లు.. అత్యవసరంగా ఆపరేషన్

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని గగనతలంలో కూల్చివేసేందుకు ఒమన్ జాతీయుడైన కోపైలట్ జరిపిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన 38 ఏళ్ల భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం సౌదీలో చికిత్సపొందుతున్నారు. రియల్ హీరోగా ఆయన్ను ప్రపంచం అంతా కొనియాడుతుండగా ఆయనకు పుర్రెకు పగుళ్లు వచ్చాయనే వార్త అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.

కోపైలట్ ఒక్కసారిగా గొడ్డలితో విరుచుకుపడటంతో కెప్టెన్ స్మిత్ మచ్చర్ పుర్రెలోని ఒక ఎముక భాగం విరిగి లోపలికి దిగబడిందని వైద్యులు తెలిపారు. పుర్రె ప‌గ‌ల‌డంతో ఓ ఎముక ముక్క మెద‌డు వైపు దూసుకెళ్లింది. దీన్ని చాలా తీవ్ర‌మైన గాయంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పుర్రె ఎముక లోప‌లికి వెళ్లి మెద‌డును గాయ‌ప‌రిచే అవ‌కాశం ఉంటుంది.  

దీనివల్ల మెదడుపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఏర్పడిందని, దీనికి తోడు చేతులు, ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. 
ఈక్రమంలోనే ఆయనకు సౌదీ అరేబియాలోని వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స అందించి, దెబ్బతిన్న పుర్రె భాగాన్ని పునర్నిర్మించినట్లు చెప్పారు.  మెరుగైన వైద్యం కోసం ఆయనను సౌదీ నుంచి అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుండగా చికిత్సకు ఆయన శరీరం సానుకూలంగా స్పందిస్తోందని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. 
ఈ దాడి కారణంగా భారతీయ పైలట్ పుర్రె పగలడంతో పాటు తల, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి మొదట భావించిన దానికంటే చాలా తీవ్రమైనదని, విమానాన్ని నడుపుతున్న కెప్టెన్‌ను చంపకపోయినా కనీసం శాశ్వత వైకల్యానికి గురిచేయాలనే ఉద్దేశంతోనే కో-పైలట్ దాడి చేసి ఉండవచ్చని వివరాలు సూచిస్తున్నాయి. గొడ్డలితో జరిగిన దాడిలో కెప్టెన్ మచ్చర్ పుర్రె పగిలిపోవడమే కాకుండా, ఆ దెబ్బ అతని కంటి నరాలపై, దృష్టిపై తీవ్ర ప్రభావం చూపింది. 

“నేను అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాను. కానీ మొదట తగిలిన దెబ్బల వల్ల నా చూపు దాదాపు పోయింది. అంతా మసకబారిపోయింది,” అని మచ్చర్ ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో చెప్పడం గమనార్హం. అయితే, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వైద్యపరమైన వివరాల ప్రకారం, ఆ గాయం కేవలం చూపు మసకబారడం కంటే చాలా తీవ్రమైనదని తెలుస్తోంది. 

ఈ పరిణామాల గురించి తెలిసిన వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం, ‘ఫ్లైదుబాయ్’  విమానం సౌదీ అరేబియాలో దిగినప్పుడు మచ్చర్ తల, చేతికి తీవ్ర గాయాలు ఉన్నాయి. తదుపరి చికిత్స కోసం యూఏఈకి వెళ్లే ముందు, సౌదీ అధికారులు ఆయనకు పుర్రె పగులుకు సంబంధించిన చికిత్స అందించారు. ఈ గాయాలు కెప్టెన్ జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపాయి.

 “ప్రస్తుతం నా జ్ఞాపకశక్తి చెల్లాచెదురుగా ఉంది. కానీ ఆ సమయంలో జరిగిన విషయాల్లో నాకు గుర్తున్నది ఇదే,” అని ఆయన నెతన్యాహుతో చెప్పారు. పైలట్‌పై ఎటువంటి ఒత్తిడి పడకుండా ఉండేందుకు, కుటుంబ సభ్యులు దాడికి సంబంధించిన వివరాలను ఆయనతో చర్చించడం లేదని పైలట్ భార్య సోనల్ మచ్చర్ తెలిపారు. మచ్చర్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు అధిక మోతాదులో మత్తుమందులు, నొప్పి నివారణ మందులు ఇస్తున్నారని సమాచారం. 

ఆయన ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నందున, నరాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. “ఆయన నడవడం (కొన్ని అడుగులు వేయడం), కొద్దిగా ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. కాబట్టి, ఆయన కోలుకునే దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది,” అని ఆయన పరిస్థితి గురించి తెలిసిన ఒక అధికారి తెలిపారు.

About The Author