ఓటర్ల పేర్లు తొలగింపుకు భారీగా ఫారం-7 పంపిణీపై దుమారం

*  ఫారం-7 దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలకు తెలంగాణ సీఈఓ ఆదేశాలు 
తెలంగాణలో ‘ఫారం 7’ ద్వారా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నెలకొన్న వివాదం మధ్య, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సోమవారం నాడు రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులందరికీ (డీఈఓలు) ఒక కీలక ఆదేశం జారీ చేశారు. ఈ మేరకు జారీ చేసిన ఒక మెమోలో, ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్ఓల) వద్ద ‘ఫారం 7’లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలైనట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాగే ఆ దరఖాస్తులు (ఫారాలు) నిజమైనవి కావన్న ఆరోపణలు కూడా ఉన్నాయని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
దీనిని దృష్టిలో ఉంచుకుని, ఫారాలు 6, 6ఏ, 7, 8లలో తెలిసి తెలిసి తప్పుడు ప్రకటనలు లేదా డిక్లరేషన్లు చేసిన దరఖాస్తుదారులపై ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్ఓలు) తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సిఈఓ జిల్లా ఎన్నికల అధికారులను కోరారు. ఈ చర్య అనేది విచారణ అనంతరం ఉంటుందని ఆయన తెలిపారు.
అనర్హులకు ఓటు ఉన్నట్లయితే అభ్యంతరం వ్యక్తం చేస్తూ తొలగించాలని కోరుతూ ఫారం 7 సమర్పించాల్సి ఉంటుంది.
అయితే హైదరాబాద్‌లోని ముషీరాబాద్, గోషామహల్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో కొందరి ఓటు తొలగించేందుకు భారీగా బోగస్ ఫారం-7లు సమర్పిస్తున్నారని ఇటీవల సీఈవోకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన సీఈవో కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జరిపింది.  ఫారం-7లపై క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాతే ఓటు తొలగించాలని స్పష్టం చేసింది.
ఫారం-7తో పాటు కొత్త ఓటు కోసం ఫారం-6 ఇతర అప్లికేషన్‌లలో కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమచారం, డిక్లరేషన్ ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని సీఈవో స్పష్టం చేశారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు గురువారంతో ముగియనుంది. ఎస్ఐఆర్ లో  భాగంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఎవరి పేర్లు తొలగించాలో పేర్కొంటూ ప్రింటెడ్ ఫారం-7 పత్రాలు లభించాయి. హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ పరిధిలో పత్రాలు లభించాయని సుదర్శన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విభాగం నేతలు ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్ బహదూర్పుర నియోజకవర్గంలో ప్రింటెడ్ పారం-7 పత్రాలు శుక్రవారం దర్శనమిచ్చాయి. తాజాగా శనివారం గోషామహల్ నియోజకవర్గంలోనూ లభించాయి. దీంతో అసలు ఈ పత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు వీటిని ప్రింట్ చేస్తున్నారు.? బీఎల్వోలకు ఎవరు ఇస్తున్నారు? ఎవరైనా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారా? అనే అనుమానం రాజకీయ పార్టీల్లో నెలకొంది.

ఎన్నికల జాబితా 2026లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ లో భాగంగా “ఓటర్లను పెద్దమొత్తంలో తొలగించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని” సీఈఓకి ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత టిపిసిసి ఓ వీడియోను విడుదల చేసింది. వారు ప్రదర్శించిన ఫారమ్‌లకు పేర్లు లేవు. “అవి బిజెపి బిఎల్‌ఎ దాఖలు చేసే చివరి దశలో ఉన్నాయి” అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. 

ఓటర్ల జాబితా నుంచి నిజమైన ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రీ-ఫిల్‌డ్ ఫారం-7 దరఖాస్తుల కుట్రపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు టీపీసీసీ ఫిర్యాదు చేసింది. టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, సభ్యులు ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషా మహల్ నియోజకవర్గాల్లో ఒకే తరహా ఘటనలు జరిగాయని ఆరోపించారు. ప్రీ-ఫిల్‌డ్ ఫారం-7లను ఎవరు తయారు చేశారు, ఎక్కడ ప్రింట్ చేశారు, ఎవరు పంపిణీ చేశారు? అనే దానిపై దర్యాప్తు చేయాలని కోరారు.

కాగా, ఆదివారం విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన బిఎల్‌ఎలు బల్క్ ఫారం 7లను సమర్పించలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ దురుద్దేశపూరిత ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఓటర్లు తమ పేరును తొలగించాలనుకుంటే లేదా వారి నియోజకవర్గంలోని ఇతర ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేయాలనుకుంటే ఫారమ్ 7లను ఉపయోగిస్తారు. 

“దేశ పౌరులు కాని రోహింగ్యాలకు” వ్యతిరేకంగా బల్క్ ఫారం 7లు సమర్పిస్తున్నట్లు తెలంగాణ బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. రోహింగ్యాల నమోదుకు ఎఐఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్ఎస్ సహా రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయని ఆరోపిస్తూ వారికి ఓటు హక్కును నిరాకరించడానికి ఫారం 7లను దాఖలు చేయడంలో తప్పు లేదని ఆయన సమర్ధించుకున్నారు. 

రోహింగ్యాలకు భారతదేశంలో ఓటు హక్కు లభించకుండా ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యక్తిగతంగా హామీ ఇవ్వాలని ఆయన కోరారు. “అతను నిజమైన భారతీయుడైతే, అతను దానిని చూసుకోవాలి” అని సుభాష్ చెప్పారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఈ తరహా ఘటనలు బయటకు వస్తుండటంతో ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించడంతో తెలంగాణలో ఇప్పటి వరకు ఫలానా వారి ఓట్లను తొలగించాలంటూ ఎన్నికల అధికారులకు దాదాపుగా 29 వేల దరఖాస్తులు అందినట్లు వెల్లడైంది. 

దీంతో  ఫామ్-7లో తప్పుడు సమాచారం సమర్పిస్తున్న వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓలకు  సీఈవో సుదర్శన్‌ రెడ్డి  సూచించారు. చర్యలకు ముందు విచారణ నిర్వహించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960లోని రూల్ 20 ప్రకారం విచారణ సాగాలని చెప్పారు. ఈ మేరకు జీహెమ్‌ఎమ్‌సీ కమిషనర్, హైదరాబాద్ డీఈఓతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీఈఓలకు ఉత్తర్వులు జారీ  చేశారు.

 

About The Author