ఖైరతాబాద్ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయిస్తోందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిగ్గులేకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటోందని ఆమె మండిపడ్డారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని ఆమె సవాల్ విసిరారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఫిరాయింపులు ప్రోత్సహించి, దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డాయని ఆమె దుయ్యబట్టారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ సిద్ధాంతాన్నే పాటించి సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఆమె విమర్శించారు.
ఆ ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీ అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని అరుణ ఎద్దేవా చేశారు. తమ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారనే నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి, పోటీ చేయించి గెలిపించాలని ఆమె డిమాండ్ చేశారు. బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నామని, అన్ని హామీలు అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఓటు అడగడానికి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
గతంలో ఖైరతాబాద్ సీటును బీజేపీ గెలుచుకుందని ఆమె గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో అక్కడ కాషాయ జెండానే ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్, బిఆర్ఎస్లకు తగు బుద్ది చెబుతారని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందని ఆమె చెప్పారు. స్వార్థ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదని డీకే అరుణ హెచ్చరించారు.

More Stories
`సామూహిక ఓటు హక్కు రద్దు’ “రెండో తరగతి పౌరులుగా” మారుస్తుంది
ఎన్నికల సంఘం స్థానికులందరిని ఒకే తేదీన రప్పించాలి
అమూల్ ప్లాంట్‌తో పాడి రంగానికి కొత్త ఊతం