ఫ్లైదుబాయ్ విమానానికి సంబంధించిన ఎఫ్‌జెడ్1073 ఘటనలో విధులు నిర్వర్తించిన ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరామర్శించారు. కెప్టెన్ స్మిత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
యుఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రి కూడా అయిన మక్తూమ్, 39 ఏళ్ల మచ్చర్‌తో జరిపిన సమావేశానికి సంబంధించిన ఫోటోలను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో పంచుకున్నారు. దేశ నాయకత్వం మొత్తం ఆయన పట్ల ‘ప్రశంసలు, అభినందనలతో’ నిండి ఉందని ఆయన పేర్కొన్నారు. “అత్యున్నత స్థాయి ధైర్యం, బాధ్యత, మానవ ప్రాణాల పట్ల శ్రద్ధను ప్రదర్శించిన ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కలిసిన సందర్భంగా…” అని మక్తూమ్ తెలిపారు.
ఆయన తమ బృందంలో భాగం కావడం, యూఏఈ కథలో భాగం కావడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. కరుణ, శాంతి, ప్రాణాలను కాపాడే విలువలకు యూఏఈ ప్రతీకగా నిలుస్తుందని ఆ విలువలను కెప్టెన్ స్మిత్ ప్రతిబింబించారని పేర్కొన్నారు. మరోవైపు కెప్టెన్ స్మిత్ ఆరోగ్యం మెరుగుపడుతోందని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, కోలుకుంటున్నారని పేర్కొంది.
ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నామని వెల్లడించింది. కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. ఆయనకు అందుతున్న వైద్య సహాయానికి యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

More Stories
అమెరికాలోని ఓహియోలో హిందూ ఆలయంపై ఇటుకలతో దాడి
చైనాపై స్వర్ణం గెలుపొందిన భారత పురుషుల క్రికెట్ జట్టు
చైనాను ఓడించి 44 ఏళ్ల తర్వాత హాకీలో బంగారు పతకం