అద్భుతమైన బడ్జెట్‌ను ప్రకటిస్తాం 

అద్భుతమైన బడ్జెట్‌ను ప్రకటిస్తాం 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను మునుపెన్నడూ లేనంత అద్భుతమైన బడ్జెట్‌ను ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  భరోసా ఇచ్చారు. కరోనా ప్రభావంతో చితికిపోయిన అన్ని రంగాలను బలోపేతం చేయడానికి, పడిపోయిన వృద్ధిరేటును తిరిగి నిలబెట్టడానికి గత వందేండ్లలో ఎప్పుడూ చూడని బడ్జెట్‌ను ప్రవేశపెడతామని పేర్కొన్నారు.  

ఇందుకు పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అవసరమని ఆమె కోరారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సు-2020 ను ఉద్దేశించి నిర్మల మాట్లాడారు. ఈసారి బడ్జెట్‌లో జీవనోపాధి, ఆరోగ్య సంరక్షణ రంగాలకు పెద్దపీట వేస్తామని తెలిపారు.

కాగా, ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది కీలకపాత్రేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2021-22 కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.  

ఇలా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని, దీనికి మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా ఎక్కువగానే వస్తున్నాయని ఆమె తెలిపారు.

ఆమె భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ దేశ స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని చెప్పారు. దీనితోపాటు సంస్కరణలను ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా, స్థిరమైన ప్రభుత్వం దేశీయ కంపెనీల్లోకి దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగంలోని కొన్ని పెద్ద కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కొవిడ్‌-19 సంక్షోభ సమయంలోనూ సజావుగా ముందుకు సాగుతున్నాయని, ఈ కంపెనీల్లో వాటాల కొనుగోలుకు ఎంతో మంది ఆసక్తి వ్యక్తం చేశారని ఆమె  తెలిపారు.

ఈ వాటాల అమ్మకానికి సంబంధించిన తదుపరి దశ ప్రక్రియ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ముందుకు సాగుతుందని చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆమె ఆకాంక్షించారు.