విలువలతో కూడిన, నైపుణ్య ఆధారిత విద్యకు సమగ్ర మార్పులు

భారతదేశ భవిష్యత్ తరాలకు నాణ్యమైన, విలువలతో కూడిన, నైపుణ్య ఆధారిత విద్యను అందించేందుకు విద్యా రంగంలో సమగ్ర మార్పులు అవసరమని అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ (ఏబిఆర్ఎస్ఎం) జాతీయ కార్యవర్గ మండలి సమావేశం అభిప్రాయపడింది. “జాతీయ విద్యావేత్తల మేధోమథనం – రాబోయే తరాల విద్యకు దిక్సూచి” అనే భావనతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి సమావేశం విద్యా రంగ భవిష్యత్ దిశపై కీలక చర్చలకు వేదికగా నిలిచింది.

దేశవ్యాప్తంగా వచ్చిన విద్యావేత్తలు, ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ బాధ్యులు విద్యా రంగంలో జరుగుతున్న మార్పులు, సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై మేధోమథనం చేశారు.  విద్యార్థికి కేవలం డిగ్రీ అందించడం కాకుండా జ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలను సమన్వయం చేసే విద్యా విధానం అవసరమని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఏబిఆర్ఎస్ఎం గత మూడు సంవత్సరాలుగా నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలు, విద్యా చర్చా వేదికలను జాతీయ కార్యవర్గం సమీక్షించింది. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా రంగంలో వస్తున్న మార్పులు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు.

రాష్ట్ర, జిల్లా, క్షేత్రస్థాయి యూనిట్లను మరింత బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై నిరంతర చర్చలు నిర్వహించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపి-2020) అమలుపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఏబిఆర్ఎస్ఎం  ఆధ్వర్యంలో ఐఐటీ చండీగఢ్, ఎన్ఐటి నాగాలాండ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో పాటు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జైపూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, ఆలోచనా మంథన కార్యక్రమాలపై ప్రతినిధులు వివరాలు వెల్లడించారు.

ఎన్ఈపి-2020 లక్ష్యాలు, విధానపరమైన మార్పులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాసంస్థలకు మరింత సులభంగా చేరేలా నిరంతర అవగాహన కార్యక్రమాలు అవసరమని సమావేశం పేర్కొంది. ప్రస్తుత ప్రపంచంలో విద్య కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులకు పరిమితం కాకూడదని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. “చదువు – నైపుణ్యం – పరిశోధన – సాంకేతికత – ఉపాధి – దేశ నిర్మాణం” అనే సమగ్ర దృక్పథంతో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని జాతీయ విద్యావేత్తలు చర్చించారు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, డిజిటల్ పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలు, పరిశోధనా ఆసక్తిని పెంపొందించడంతో పాటు భారతీయ జ్ఞాన సంపద, సంస్కృతి, విలువలను విద్యతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని సమావేశం ప్రస్తావించింది. విద్యా వ్యవస్థలో ఏ సంస్కరణ అయినా విజయవంతం కావాలంటే ఉపాధ్యాయుల భాగస్వామ్యం అత్యంత కీలకమని సమావేశం పేర్కొంది.

ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, నిరంతర శిక్షణ, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, విద్యార్థుల మానసిక–సామాజిక అవసరాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించారు. ఉపాధ్యాయుడిని కేవలం బోధకుడిగా కాకుండా భవిష్యత్ తరాల మార్గదర్శిగా తీర్చిదిద్దడమే విద్యా పరివర్తనకు కీలకం అనే అంశంపై మేధోమథనం జరిగింది.

భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు. భారతీయ జ్ఞాన సంపదతో ఆధునిక విజ్ఞానాన్ని, నైపుణ్యాలతో పరిశోధనను, విద్యతో ఉపాధి అవకాశాలను అనుసంధానం చేయడం ద్వారా యువతలోని సామర్థ్యాన్ని దేశ అభివృద్ధికి వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.


రాబోయే రోజుల్లో నైపుణ్య ఆధారిత విద్య, ఎన్ఈపి -2020, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, సాంకేతిక విద్య, పరిశోధన, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యా సంస్థల బలోపేతం వంటి అంశాలపై మరిన్ని జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు సమావేశంలో చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు, విద్యార్థులు, విద్యాసంస్థలను కలుపుతూ విస్తృతమైన చర్చా వేదికలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సమావేశం గుర్తించింది.

సమావేశానికి  ఏబిఆర్ఎస్ఎం జాతీయ అధ్యక్షులు నారాయణ్ లాల్ గుప్తా, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ భాయ్ మెహతా,  ఏబిఆర్ఎస్ఎం జాతీయ కార్యదర్శి ఆచార్య గీతా భట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ  మహేంద్ర కపూర్, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు పలువురు జాతీయ కార్యవర్గ బాధ్యులు హాజరయ్యారు.

దేశ విద్యా రంగంలో జరుగుతున్న మార్పులు, ఎన్ఈపి-2020, నైపుణ్య ఆధారిత విద్య, ఉపాధ్యాయుల పాత్ర, యువత భవిష్యత్, సాంకేతికత, పరిశోధన వంటి అంశాలపై సమాజంలో విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్. సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని  ఏబిఆర్ఎస్ఎం ఆకాంక్షించింది. 

About The Author