గుజరాత్ అసెంబ్లీ గత మార్చిలో చేసిన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీర్మానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోదించారు. దీంతో ఈ చట్టం రాష్ట్రంలో అమలులోకి రానుంది. యూసీసీని అమలు చేయబోతున్న రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలవబోతుంది. ఇంతకుముందు మొదటిసారిగా ఉత్తరాఖండ్ ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు గుజరాత్ కూడా ఈ చట్టాన్ని అమలు చేయబోతుంది.
గుజరాత్ యునిఫాం సివిల్ కోడ్ బిల్, 2026 పేరిట ఈ బిల్లును ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఇకపై వివాహం, సహజీవనం, ఆస్తి పంపకాలు వంటివన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయాల్లో కొత్త రూల్స్ అమలవుతాయి.
యూసీసీ ప్రకారం చట్టంలో రానున్న కీలక మార్పులివే. గిరిజన తెగలకు మినహా అందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం వారసత్వపు ఆస్తి హక్కు విషయంలో స్త్రీలు, పురుషులకు సమాన హక్కులుంటాయి. అంటే, కొడుకుకైనా, కూతురుకైనా ఆస్తి విషయంలో సమాన హక్కు ఉంటుంది. ఎవరైనా సహజీవనం చేస్తే ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అలా చేయకుండా సహజీవనాన్ని కొనసాగించినా కూడా నేరమే. పెళ్లిళ్లతో సమానంగా సహజీవనాన్ని కూడా నమోదు చేసుకోవాల్సిందే.
విడాకులు కూడా చట్టబద్ధంగా జరగాల్సిందే. సహజీవనం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకంగా చెప్పుకోవాలి. తాము సహజీవనానికి వ్యతిరేకం కాదని సీఎం భూపేష్ పటేల్ చెప్పారు. అయితే, ఈ విషయంలో మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇస్తామని, అందువల్లే సహజీవనానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేలా చట్టం తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు అందరికీ సమాన హక్కులు ఉంటాయని, మత పరంగా ఎలాంటి మినహాయింపు ఉండదని ఆయన చెప్పారు. అన్ని మతాలవారికి సమానంగా యూసీసీ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

More Stories
ఎస్ఐఆర్ నిరసనలతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ నిలిపివేత
‘ఆ సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తున్నాను’
కోల్కతా విమానాశ్రయం మసీదులో ప్రార్థనలకు అనుమతి నిరాకరణ