కర్ణాటక అసెంబ్లీలో ఉర్దూ ఉత్సవంపై బిజెపి, కన్నడ సంఘాల అభ్యంతరం 

కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో ఉర్దూ ఉత్సవం నిర్వహించాలన్న ప్రతిపాదనపై వివాదం చెలరేగింది. బీజేపీతో పాటు కన్నడ అనుకూల సంస్థలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే విధానసౌధ ప్రాంగణంలో భాషా ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించింది.  సెప్టెంబర్ 9న ఉర్దూ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఊర్దూ ఉత్సవం నిర్వహించాలని తమ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మంత్రి యూటీ ఖాదర్ గురువారం తెలిపారు. 

భాష, సంస్కృతిపై మరింత అవగాహన కల్పించడమే ఈ వేదిక ఏర్పాటు లక్ష్యమని చెప్పారు. ఎలాంటి వివాదం సృష్టించడం దీని ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. వార్షిక ఉర్దూ సాహిత్య పురస్కారాన్ని గతంలో ఒక హాలులో ప్రదానం చేసేవారని మంత్రి ఖాదర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశంలో నిర్వహించాలని తాను ప్రణాళిక వేసినట్లు ఆయన చెప్పారు. 

ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వారు ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశ్యాన్ని గాని, భాషను గానీ అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చని మంత్రి పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమం వల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే వేదిక మార్పును పునఃపరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు.

తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అన్ని వర్గాలతోనూ సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ప్రతిపాదిత వేదిక అనేది ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. మైనారిటీ ప్రజల ప్రసన్నం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

 కాగా,విధానసౌధ మెట్లపై కన్నడకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తూ, అక్కడ ఉర్దూ ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఆరోపించారు. మైనారిటీ వర్గాలను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన విమర్శించారు.

 
“కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినప్పుడు, పిల్లలపై హిందీని రుద్దుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించింది. కానీ ఇప్పుడు, విధానసౌధ మెట్లపై కన్నడ స్థానంలో ఉర్దూ ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా, ప్రభుత్వం తన వైఖరిని తానే బయటపెట్టుకుంది” అని ధ్వజమెత్తారు.  పైగా, విధాన సౌధలో “పాకిస్థాన్ జిందాబాద్” నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పైగా వారిని కాపాడేలా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
 
ఈ ప్రతిపాదనను కర్ణాటక రక్షణ వేదిక వంటి కన్నడ అనుకూల సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వారు దీనిని “మూర్ఖపు, అపరిపక్వ, అహంకారపూరితమైనది”గా అభివర్ణించారు. ఎక్స్ లో ఒక పోస్టులో, దాని అధిపతి నారాయణ గౌడ, ఈ ప్రతిపాదన “పర్యవసానాలు లేకుండా ఏదైనా చేయవచ్చనే నిర్లక్ష్య వైఖరిని” ప్రతిబింబిస్తోందని ధ్వజమెత్తారు. “సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడంలో ప్రభుత్వమే ముందుండి నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది,” అని ఆయన జోడించారు. 
 
“ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమం జరగడానికి తమ సంస్థ అనుమతించదు” అని కూడా గౌడ హెచ్చరించారు. తమ సంస్థ ఉర్దూ లేదా ఇతర భాషలకు వ్యతిరేకం కాదని నొక్కి చెబుతూనే, ఆయన దీనిని “పిచ్చి” అని అభివర్ణిస్తూ, ముఖ్యమంత్రి దీనిని ఆపాలని కోరారు.

About The Author