ఫ్లైదుబాయ్ పైల‌ట్ ఓ హీరో.. ప్ర‌శంసించిన ట్రంప్‌, మోదీ

*  `విశిష్ఠ గుజరాత్ గరిమ’ అవార్డు ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం 
 
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానం హైజాక్‌ను అడ్డుకున్న  భార‌త జాతీయుడైన ఫ్లైదుబాయ్ పైల‌ట్‌ను స్మిత్ మ‌చ్చ‌ర్‌ చూపిన తెగువ‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. అత‌న్ని హీరోగా పోల్చారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. ఓవ‌ల్ ఆఫీసులో రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడిన ట్రంప్‌ ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూతో ఈ అంశం గురించి మాట్లాడిన‌ట్లు చెప్పారు. భార‌త ప్ర‌ధాని మోదీ, ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్య‌హూ కూడా పైల‌ట్ మ‌చ్చ‌ర్ సాహసాన్ని కొనియాడారు.

బ‌హుశా ఆ పైల‌ట్ ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉండి ఉంటుంద‌ని, కానీ అత‌ను చూపిన తెగువ అద్భుత‌మ‌ని, అత‌నో హీరో అంటూ ట్రంప్ పేర్కొన్నారు. పైల‌ట్ త‌న కాక్‌పిట్ డోర్‌ను తెరిచి, ప్ర‌యాణికుల నుంచి స‌హాయం కోరాడ‌ని, బ‌హుశా ఆ కోపైల‌ట్ ఉగ్ర‌వాది అయి ఉంటాడ‌ని ట్రంప్ అన్నారు. ఓ ఇజ్రాయిలీ ప్యాసింజ‌ర్ ర‌క్త‌సిక్త‌మైన పైల‌ట్ మ‌చ్చ‌ర్‌ను కాపాడిన‌ట్లు ట్రంప్ తెలిపారు.

మచ్చర్‌ను ‘హీరో’గా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశం మొత్తం స్మిత్‌ను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు. ప్రమాదం ఎదురైన సమయంలో, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు మచ్చర్ గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. ఆయన తెగువ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంతో పాటు పెను విషాదాన్ని అడ్డుకుందని తెలిపారు. ఆయన వేగంగా కోలుకుని, మరింత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాన్నట్లు పేర్కొన్నారు.

కెప్టెన్ స్మిత్ మచ్చర్ భార్య, తల్లిదండ్రులతో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని ప్రశంసించారు. అంతే కాకుండా ఆయన కుటుంబానికి భారతదేశం తరఫున సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

అసమాన ధైర్యసాహసాలు చూపిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్​ ప్రభుత్వ  విశిష్ఠ గుజరాత్ గరిమ అవార్డును ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను సౌదీ అరేబియా నుంచి దుబాయ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు.  ఇప్పటివరకు సౌదీ అరేబియాలోని మిలిటరీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. మరింత మెరుగైన చికిత్స కోసం యూఏఈకి తరలించారు. మరోవైపు స్మిత్ మచ్చర్‌ను ఇజ్రాయెల్ సత్కరిస్తుందని భారత్‌లోని ఆ దేశ రాయబారి రూవెన్ అజార్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కాక్‌పిట్‌లో దాడి చేసేందుకు ఉపయోగించింది కత్తిని కాదు 

ప్రయాణంలో ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం కాక్‌పిట్‌లోకి పైలట్ కత్తిని ఎలా తీసుకెళ్లగలిగాడనే ప్రశ్నలు మొదట్లో తలెత్తినప్పటికీ.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అసలు దాడికి ఉపయోగించిన ఆయుధం కత్తి కాదని, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు కాక్‌పిట్‌లో భద్రపరిచే ‘క్రాష్ యాక్స్’ (గొడ్డలి) అని తెలుస్తోంది. 

ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ ఈ గొడ్డలితోనే తనపై దాడికి పాల్పడ్డాడని.. భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ వెల్లడించినట్లు సమాచారం. ఈ దాడి జరుగుతున్న సమయంలో 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం వేల అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందకు పడిపోవడం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగడం, అత్యవసర సంకేతాలు వెళ్లడంతో పరిస్థితి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. 

దాడిలో తల, చేతులకు తీవ్ర గాయాలై, రక్తం విపరీతంగా కారిపోతున్నప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ప్రాణాలను పణంగా పెట్టి కాక్‌పిట్ తలుపులను అన్‌లాక్ చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ఇతర సిబ్బంది లోపలికి ప్రవేశించి దాడికి పాల్పడిన కో-పైలట్‌ను పట్టుకుని కట్టడి చేయగలిగారు.  ఆ తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లు కాక్‌పిట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఏడాది క్రితం చెప్పిన మాటలే నిజం అయ్యాయి 

ఈ క్రమంలోనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ చెప్పిన మాటలను అజిత్ దోవల్ ప్రత్యేకంగా గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ విమాన ప్రయాణాలు, అత్యవసర పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు.

“ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం లేదా అనుకోని విపత్తు సంభవిస ఆ క్షణంలో మిమ్మల్ని ఎవరు కాపాడగలరు? ఖచ్చితంగా విమానంలో ఉండే సిబ్బంది మాత్రమే మీ ప్రాణాలను కాపాడగలరు” అని ఆయన ఆ ఇంటర్వ్యూలో నొక్కి చెప్పారు.  నాటి ఆ సంభాషణను నేడు అజిత్ దోవల్ గుర్తుచేస్తూ “ఏడాది కిందట ఆయన చెప్పిన ఆ ఖచ్చితమైన మాటలు, నేడు ఆయన చేసిన సాహసంతో అక్షరాలా నిజమై నిరూపితమయ్యాయి” అని కొనియాడారు.

ఆదుకున్న పైలట్, ప్లంబర్, బ్యాంకర్, వ్యాపారవేత్త, డెంటిస్ట్

వృత్తిరీత్యా ప్లంబర్ అయిన యానివ్ హయున్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించి కో-పైలట్‌ను పట్టుకుని వెనక్కి లాగారు. విమానం కూలిపోకుండా ఉండేందుకు ‘మేడే’ షో ద్వారా నేర్చుకున్న నైపుణ్యంతో విమాన కంట్రోల్స్ (యోక్)ను వెనక్కి లాగి విమానాన్ని సమతుల్యం చేశారు. ఇతనికి వ్యాపారవేత్త అసాఫ్ రాజువాన్, బ్యాంకింగ్ రంగానికి చెందిన జ్వికా మానెస్ తోడయ్యారు.  ప్రయాణికులకు ఇచ్చే హెడ్‌ఫోన్ వైర్ల సహాయంతో అత్యంత బలవంతుడైన ఆ కో-పైలట్‌ను కట్టిపడేసి సుమారు 50 నిమిషాల పాటు ఆధీనంలో ఉంచారు.
మరోవైపు విమానంలో ప్రయాణిస్తున్న ఏకైక వైద్యుడు, డెంటిస్ట్ షోటా ముసయేవ్ తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు అత్యవసర వైద్యం అందించారు. విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేంత వరకు స్మిత్ మచ్చర్ రక్తాన్ని నియంత్రించి ఆయన ప్రాణాలను నిలబెట్టారు.  అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఆఫ్-రోస్టర్ పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ విధంగా విమానంలో అందరిని ఆ ఐదుగురి సాహసమే కాపాడింది. 

About The Author