లక్షద్వీప్ లో రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్.. ఐదుగురు పాకిస్థానీయులు అరెస్ట్

లక్షద్వీప్ సమీప అరేబియా సముద్రంలో ఇరాన్‌కు చెందిన ఓ పడవ నుంచి రూ.3,000 కోట్లకు పైగా విలువైన 526 కిలోల మెథాంఫెటమైన్, హెరాయిన్‌ను భారత కోస్ట్‌గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.  
 
అనుమానాస్పద పడవను లక్షద్వీప్‌కు పశ్చిమాన అడ్డుకుని తనిఖీ చేయగా అధిక నాణ్యత కలిగిన మెథాంఫెటమైన్, హెరాయిన్ లభించినట్లు కోస్ట్‌గార్డ్ తెలిపింది. పడవ, దాని సిబ్బంది, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను సాయుధ భద్రత మధ్య ముంబైకి తరలించి సంయుక్త విచారణ, తదుపరి న్యాయ ప్రక్రియ చేపట్టారు. ఇరాన్ నుంచి సముద్రమార్గంలో భారత్‌కు డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు గుజరాత్ ఏటీఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి తెలిపారు. 
 
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సముద్రంలో మరో పడవ నుంచి డ్రగ్స్‌ను స్వీకరించిన అనంతరం వాటిని తమిళనాడు తీరానికి తరలించాల్సి ఉందని చెప్పారు.  ‘ఆజాద్’గా గుర్తించిన అనుమానాస్పద ఇరాన్ పడవను సెప్టెంబర్ 25 సాయంత్రం లక్షద్వీప్‌కు వాయువ్యంగా సుమారు 160 నాటికల్ మైళ్లు, ముంబైకి నైరుతి దిశగా 490 నాటికల్ మైళ్ల దూరంలో అడ్డుకున్నట్లు జోషి తెలిపారు. 
 
ఓ నైజీరియా పౌరుడు గుజరాత్‌కు చెందిన ఓ పరారీలో ఉన్న నిందితుడిని ఇటీవల కలిశాడని, ఇరాన్ నుంచి 500 కిలోలకు పైగా మెథాంఫెటమైన్, హెరాయిన్‌ను భారత్‌కు తరలించే ప్రణాళిక రూపొందించినట్లు నిఘా సమాచారం వెల్లడించిందని జోషి చెప్పారు. ముందస్తు చెల్లింపులు హవాలా మార్గాల్లో జరిగినట్లు, గుజరాత్ తీరాన్ని తప్పించుకుని సముద్రంలోనే సరుకును మరో పడవకు బదిలీ చేయాలని స్మగ్లర్లు భావించినట్లు తెలిపారు. 
 
సెప్టెంబర్ 14న ప్రారంభమైన ఆపరేషన్ సుమారు 10 రోజులపాటు కొనసాగిన అనంతరం సెప్టెంబర్ 25న అనుమానాస్పద పడవను అడ్డుకున్నట్లు జోషి తెలిపారు. విశాలమైన సముద్రంలో అనుమానాస్పద పడవలను పరిశీలించి లక్ష్యంగా ఉన్న పడవను గుర్తించడం సవాలుతో కూడుకున్నదని ఆయన చెప్పారు. పడవను అడ్డుకున్న అనంతరం తనిఖీ చేయగా సముద్రంలో శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం స్టార్‌లింక్ పరికరం కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. 
 
అదుపులోకి తీసుకున్న వారిని మహ్మద్ యాకూబ్ బలోచి, షకీరుల్లా, ఫరీదుల్లా, అహ్మద్ ఖాన్, వహీదుల్లా ఖాన్‌గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్‌లోని పెషావర్‌కు చెందినవారని ఏటీఎస్ తెలిపింది. ఏటీఎస్ వివరాల ప్రకారం పడవ ఇరాన్‌లోని కోనారక్ పోర్టు సమీపం నుంచి బయలుదేరింది. పాకిస్థాన్‌లోని గ్వాదర్ సమీప జలాల మీదుగా వెళ్తున్న సమయంలో చిన్న పడవలో వచ్చిన స్మగ్లర్లు డ్రగ్స్‌ను ఇరాన్ పడవకు బదిలీ చేసినట్లు జోషి తెలిపారు. 
 
హాజీ సలీం నిర్వహిస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు ఈ సరుకు చెందినదిగా అనుమానిస్తున్నామని, తమిళనాడుకు చేరిన తర్వాత అక్కడి నుంచి పంజాబ్‌కు తరలించి, నైజీరియా వ్యక్తికి అప్పగించాల్సి ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. గుజరాత్ తీరంలో ఏటీఎస్, ఇతర దర్యాప్తు సంస్థల నిఘా పటిష్ఠంగా ఉండటంతో స్మగ్లర్లు ప్రత్యామ్నాయ సముద్రమార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. 
 
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్ నుంచి వచ్చే మాదకద్రవ్యాలను ఇతర రాష్ట్రాల వైపు మళ్లిస్తున్నట్లు జోషి తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి పరారీలో ఉన్న గుజరాత్ నిందితుడి కోసం ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి గాలిస్తున్నామని, అతడి పేరును వెల్లడించలేదని చెప్పారు.  

About The Author