ఎల్‌నినో ప్రతికూల పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రైతులు పండించిన పంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50శాతం అదనపు లాభం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
తాజా నిర్ణయంతో 2027-28 సీజన్‌కు గోధుమలు, పప్పు ధాన్యాలకు మద్దతు ధరను పెంచింది. గోధుమలకు మద్దతు ధర రూ.2,610లకు, శెనగలకు రూ.5,958లకు పెంచింది. అలాగే, క్లీన్ ఎనర్జీ ప్రోత్సాహానికి పీఎం ధార పథకం కోసం రూ.1,84,650 కోట్లు, ఢిల్లీలో ఐటీఎంఎస్కు రూ.1,705 కోట్లను కేటాయించింది. పీఎం ధార పథకం ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ, 2035 నాటికి 900 మెగావాట్ల ఉత్పత్తి సాధనే లక్ష్యంగా పెట్టుకుంది.
అత్యధికంగా కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.675 పెంచగా, ఆ తర్వాత ఆవాలకు క్వింటాల్‌కు రూ.413 చొప్పున పెంచారు. కందిపప్పు, బార్లీ, శనగ, గోధుమ పంటలకు వరుసగా క్వింటాల్‌కు రూ.390, రూ.136, రూ.83, రూ.25 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గోధుమలు క్వింటాల్‌కు రూ.2,585 ఉండగా, తాజా పెంపుతో రూ.2,610కి చేరుతుంది.
అలాగే, బార్లీ క్వింటాల్ రూ.2,150 ఉండగా, రూ.136 పెంచడంతో రూ.2,286 లభిస్తుంది. శెనగలు రూ.5,875 ఉండగా, రూ.83 పెంచడంతో క్వింటాల్ రూ.5,958కు చేరుతుంది. కందిపప్పు రూ.390 పెంచడంతో క్వింటాల్ 7,390కి చేరుకోగా, ఆవాలకు రూ.413 పెంచడంతో క్వింటాల్ కనీస ధర రూ.6,613కు చేరింది. కుసుమ గింజలకు మద్దతు ధరను రూ.675 మేర పెంచడంతో రూ.7,215కు చేరింది.
ఇక ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలను తెరదించేందుకు ఏఐ ఆధారిత ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ సిస్టమ్‌ను అమల్లోకి తేనున్నట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు. రూ. 1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించిన ఐటీఎంఎస్ ప్రాజెక్టును అమలుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ 42 గుర్తించిన ట్రాఫిక్ కారిడార్లను కవర్ చేస్తుంది. దీనిని 24 నెలల వ్యవధిలో మూడు దశల్లో అమలు చేస్తారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఆపరేషన్, నిర్వహణ ఉంటుంది.
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఏకంగా లక్షా 86 వేలకోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశకు కేబినెట్ మార్గం సుగమం చేసింది. 2030 నాటికి 500 జిడబ్ల్యు పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశ లక్ష్యానికి ఇది ఎంతో కీలకంగా మారనుంది.

More Stories
లక్షద్వీప్ లో రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్.. ఐదుగురు పాకిస్థానీయులు అరెస్ట్
రూ.2,700 ఔషధానికి రూ.27,000 వేల ఎమ్మార్పీ.. సుప్రీం దిగ్బ్రాంతి
పండుగల వేళ 11 శాతం పెరిగిన పప్పుల ధరలు