బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హైదరాబాద్లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లను ఆదివాసులతో కలిసి ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
మావల మండలం, బట్టిసవర్గాం గ్రామంలోని సర్వే నం. 72లో ఉన్న కొమురం భీం కాలనీలో సుమారు 500 ఆదివాసీ కుటుంబాలు దాదాపు 30 సంవత్సరాలుగా నివసిస్తున్నా, వారికి ఇళ్ల పట్టాలు/గుర్తింపు పొందిన ఇంటి స్థల హక్కులు లేవని ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యుత్, సురక్షిత తాగునీరు వంటి కనీస సౌకర్యాలు పొందడంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం అర్హులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. అనంతరం కార్యక్రమంలో ఆదివాసీ కుటుంబాలు వారి సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి గవర్నర్ ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఆదివాసుల సమస్యలను ఇప్పటికే అసెంబ్లీలో ఎన్నో సార్లు ప్రస్తావించాను. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నెల రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే, అక్కడ నివసిస్తున్న 2 వేల కుటుంబాలతో కలిసి సెక్రటేరియట్ ముందు నిరసన ధర్నా చేపడతాం,” అని శంకర్ హెచ్చరించారు.

More Stories
మహిళా ఎమ్యెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించండి
శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం