జమ్మూ కాశ్మీర్‌లోని కఠువా జిల్లా బసోహ్లిలో ఉన్న సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద, తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో ఒక అధికారి సహా నలుగురు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పవర్ ప్రాజెక్ట్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత, ఒక జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
కఠువా జిల్లాలోని కొండ ప్రాంతంలో ఉన్న బసోహ్లి-సేవా 2 ప్రాజెక్ట్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. మరణించిన నలుగురిలో ఒక అసిస్టెంట్ కమాండెంట్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జవాన్‌ను కఠువా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. కఠువా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహితా శర్మ కాల్పుల ఘటనను ధృవీకరించారు.
ఈ సంఘటన జమ్మూ కాశ్మీర్‌లోని బసోహ్లి, హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాల మధ్య ఉన్న సేవా హైడల్ పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగింది. సేవా పవర్ ప్రాజెక్ట్ అనేది రావి నదికి ఉపనది అయిన సేవా నదిపై ఒక గ్రామంలో ఉన్న జలవిద్యుత్ కేంద్రం. బాధితులను అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్‌గా గుర్తించారు.
హెడ్ కానిస్టేబుల్ అవదేశ్ కుమార్ సింగ్‌గా గుర్తించిన అనుమానిత షూటర్, కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, తనకు కేటాయించిన ఏకే-47 రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని వద్ద 150 రౌండ్ల మందుగుండు సామగ్రి ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ తెలిపింది. సీనియర్ పోలీసు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఢిల్లీలోని పార్లమెంట్ భవన సముదాయంలో నియమిస్తున్నవారితో సహా, “అత్యంత సున్నితమైన” విభాగాల్లో పనిచేసే సిబ్బంది కోసం సిఐఎస్ఎఫ్ ప్రత్యేక సైకోమెట్రిక్ (మానసిక సామర్ధ్య/ప్రవర్తనా) పరీక్షలను నిర్వహిస్తుందని ఆ దళ ప్రతినిధి తెలిపారు.
సిబ్బందిలో ప్రవర్తనాపరమైన మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితుల సంకేతాలను ముందుగానే గుర్తించి, తగిన సమయంలో వృత్తిపరమైన సహాయం అందించేలా తమ వైద్య అధికారులు, యూనిట్ కమాండర్లకు శిక్షణ ఇస్తామని ఆ పారామిలిటరీ దళం పేర్కొన్నది. ఈ చర్యలు, సిఐఎస్ఎఫ్, ఢిల్లీకి చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్’ మధ్య శుక్రవారం కుదిరిన మూడేళ్ల అవగాహన ఒప్పందంలో భాగం.
సిఐఎస్ఎఫ్ సిబ్బందికి మానసిక ఆరోగ్య మద్దతును బలోపేతం చేయడం మరియు వృత్తిపరమైన ఒత్తిడి సమస్యలను పరిష్కరించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. “ఈ ఒప్పందం సిఐఎస్ఎఫ్ విస్తరిస్తున్న మానసిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రత్యేకమైన క్లినికల్, మానసిక చికిత్స కోణాన్ని జోడిస్తుంది” అని ప్రతినిధి తెలిపారు. ఒప్పంద సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్ మాట్లాడుతూ, తమ దళ సిబ్బంది “అత్యంత కఠినమైన మరియు అధిక బాధ్యతతో కూడిన పని వాతావరణంలో విధులు నిర్వర్తిస్తుంటారు” అని పేర్కొన్నారు.

More Stories
నవంబర్‌లో బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ భారత్ లో పర్యటన?
రాహుల్ `వోట్ చోరీ’ ఆందోళనలపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయం!
షెహజాద్ భట్టీ ట్రాప్‌లో చిక్కుకోబోయిన గుజరాత్ యువకులు!