రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయిన సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాది షెహజాద్ భట్టీ నెట్‌వర్క్‌తో సంబంధం ఏర్పడిందని గుజరాత్‌కు చెందిన ఇద్దరు యువకులు వెల్లడించారు. గుజరాత్‌లోని బార్గావ్కు చెందిన 29 ఏళ్ల జిమ్ ట్రైనర్ భట్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సెలబ్రిటీ అని నమ్మి దాదాపు రెండేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతడ్ని ఫాలో అయ్యాడు. వల్సాద్కు చెందిన 19 ఏళ్ల కుర్రాడు ఒక బట్టల దుకాణంలో పనిచేస్తుంటాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్లు, డబ్బు ఆశచూపే రీల్స్ చూసి ఆకర్షితుడయ్యాడు. వీరిద్దరికీ ఉగ్రవాద నెట్వర్క్ టాస్క్ ఇచ్చే ముందే గుజరాత్ యాంటీ-టెర్రరిజమ్ స్క్వాడ్ (ఏటీఎస్) పసిగట్టి అదుపులోకి తీసుకుంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన షెహజాద్ భట్టీ (45) కి పెద్ద నేర చరిత్ర ఉంది. 2013 ప్రాంతంలో చోరీలు, దోపిడీల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
2015లో పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లాక, ఫారూఖ్ ఖోకర్ గ్యాంగ్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. దుబాయ్ నుంచే ‘333’ అనే పేరుతో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేశాడు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న భట్టీ నెట్‌వర్క్‌కు చెందిన 40కి పైగా మాడ్యూళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.
భట్టీ నెట్‌వర్క్‌ను ఉపా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. మోడలింగ్, సెలబ్రిటీ తరహాలో లేదా మతపరమైన ప్రసంగాల పేరుతో రీల్స్ పెట్టడం. సులభంగా డబ్బు సంపాదించవచ్చని, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చని ఆశ చూపడం. ఆకర్షితులైన వారికి ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా విదేశీ వాట్సాప్ నంబర్ల ద్వారా సందేశాలు పంపి పరిచయం పెంచుకోవడం. క్రమంగా నమ్మకం కుదిరాక హ్యాండ్లర్లకు అప్పగించి చట్టవ్యతిరేక పనులకు ఉపయోగిస్తారు.
జిమ్ ట్రెయినర్ తన వాంగ్మూలంలో ‘‘భట్టీ ఒక మోడల్ లేదా సెలబ్రిటీలా కనిపించడతో ఫాలో అయ్యాను.. ఆ తర్వాత నాకు భట్టీ నుంచి మెసేజ్ వచ్చింది. ‘ఎక్కడి నుంచి?’ అని అడిగితే వివరాలు చెప్పాను. మర్నాడే గుజరాత్ ఎస్టిఎస్ నన్ను విచారణకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పింది. అతడు ఉగ్రవాది అని నాకు అప్పుడే తెలిసింది. యువతకు నేను చెప్పేది ఒకటే దేశానికి నమ్మకద్రోహం చేయకండి. సోషల్ మీడియా వ్యామోహంలో పడి కన్నవారికి కడుపుకోత మిగల్చకండి’’ అని పేర్కొన్నాడు.
‘‘ఖరీదైన కార్లు, స్విమ్మింగ్ పూల్ ఉన్న దుబాయ్ ఇళ్లను రీల్స్‌లో చూసి డబ్బు పిచ్చిలో కాంటాక్ట్ అయ్యాను. నన్ను ఒక గ్రూప్ కాల్లో కూడా కలిపారు కానీ మ్యూట్‌లో ఉంచారు. ఆ గ్రూప్‌లో ‘ఆబిద్ జాట్’ అనే పేరు గుర్తు ఉండిపోయింది. నాకు ఏదైనా టాస్క్ ఇచ్చేలోపే ఏటీఎస్ అధికారులు నన్ను పట్టుకున్నారు. నాది పెద్ద తప్పిదమని గ్రహించాను’’ అని 19 ఏళ్ల యువకుడు వెల్లడించాడు. ఈ ఘటన తర్వాత ఇద్దరు యువకులను అధికారులు విచారించి తీవ్రంగా హెచ్చరించి, ఇలాంటి అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చేపట్టిన విస్తృత దాడుల్లో భాగంగా, భారత భద్రతా సంస్థలు గత నెలలో 14 రాష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకొని, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 200 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేయడం గమనార్హం. ఆగస్టు 15 ప్రాంతంలో విధ్వంసకర దాడులకు పన్నిన ప్రణాళికలను ఈ చర్యలతో భగ్నం చేశారని అధికారులు తెలిపారు.
గత నెలలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఈ దాడులతో ముగిసిన తొమ్మిది నెలల నిఘా ఆపరేషన్, ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఒక పాకిస్తానీ గ్యాంగ్‌స్టర్ సోషల్ మీడియాను, వ్యవస్థీకృత నేరాలను ఉపయోగించి భారతదేశం అంతటా తక్కువ ఖర్చుతో కూడిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఎలా నిర్మించాడో బట్టబయలు చేసింది.
More Stories
నవంబర్‌లో బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ భారత్ లో పర్యటన?
రాహుల్ `వోట్ చోరీ’ ఆందోళనలపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయం!
తోటి జవాన్ కాల్పుల్లో నలుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి