రూ.2,700 ఔష‌ధానికి రూ.27,000 వేల ఎమ్మార్పీ.. సుప్రీం దిగ్బ్రాంతి

క్యాన్స‌ర్ వ్యాధికి వినియోగించే ఔష‌ధాల‌ను అధిక ధరకు విక్రయిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. క్యాన్స‌ర్ ఔషధాల అధికర ధ‌ర‌ల‌ను స‌వాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం మంగ‌ళ‌వారం విచారణ చేపట్టింది. రిటైలర్లకు కేవలం రూ.2,700కే సరఫరా అవుతున్న ఒక క్యాన్సర్ ఔషధంపై రూ.27 వేల ఎంఆర్‌పీ ముద్రించడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్న‌ది.
 
అసలు ధరకు, ఎమ్మార్పీకి ఇంత అంత‌రం ఉండ‌టం దోపిడీకి ఆస్కారం ఇస్తుంద‌ని వ్యాఖ్యానించింది.  దేశంలోని అన్ని రకాల మందులపై ఒకే రకమైన రిటైలర్ మార్జిన్‌ను ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు సూటిగా నిలదీసింది. ఔషధ ధరల నియంత్రణ విధానంలో భాగంగా కొన్ని మందులకు ఇస్తున్న 16 శాతం మార్జిన్‌ను అన్ని రకాల నిత్యావసర, నాన్-ఇన్సెన్షియల్, పేటెంట్- జెనరిక్ మందులన్నింటికీ ఎందుకు వర్తింపజేయలేరని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. 
 
దేశంలోని సుమారు 82 శాతం మందులు ధరల నియంత్రణ ఉత్తర్వుల పరిధిలోకి రాకుండా స్వేచ్ఛగా అమ్ముడవుతున్నాయని పిటిషనర్ కిషన్ చంద్ జైన్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భారీ వ్యత్యాసంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.  ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఫార్మసీల ద్వారానే రోగులు మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయాలంటూ బలవంతం చేయడంపై కూడా సుప్రీంకోర్టు మండిపడింది. 
 
ఆసుపత్రుల లోపల ఉండే ఫార్మసీలు చెప్పినంత ధర చెల్లించి మందులు కొనాల్సి వస్తోందని, అసలు రోగులకు బయట కొనుగోలు చేసే స్వేచ్ఛ ఎక్కడ ఉందని కోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రులు వసూలు చేస్తున్న గరిష్ట ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
రోగుల బలహీనతను ఆసరా చేసుకుని ఆసుపత్రులు చేస్తున్న ఈ వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ మాట్లాడుతూ పేదలకు సరసమైన ధరలకే మందులు అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, మెరుగైన విధానాల రూపకల్పనకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. 
 
మరోవైపు, ఫార్మా కంపెనీల తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ రిటైలర్ ధరలకు, ఎంఆర్‌పీకి మధ్య కనిపించే భారీ లాభం పూర్తిగా ఫార్మా కంపెనీల వద్దే ఉండిపోదని, సరఫరా గొలుసులోనివివిధ దశలను పరిశీలించాలని కోర్టును కోరారు.  మెడికల్ పరికరాలు, మందుల ధరలు, జెనరిక్ మందుల విధివిధానాలపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

About The Author