టాటా సన్స్ ఐపీఓ ఆపేందుకు టాటా ట్రస్ట్ ఎత్తుగడ!

స్టాక్‌ మార్కెట్లో టాటా సన్స్‌ షేర్ల లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు కంపెనీని పునర్‌వ్యవస్థీకరించాలని టాటా ట్రస్ట్‌లు సరికొత్త ప్రతిపాదనను తెర మీదికి తీసుకొచ్చాయి. టాటా సన్స్‌లో టాటా ఎలకా్ట్రనిక్స్‌ సిస్టమ్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఈఎ్‌సఎస్‌), టాటా కన్సల్టింగ్‌ ఇంజనీర్స్‌ (టీసీఈ)ను విలీనం చేయాలని ట్రస్ట్‌లంటున్నాయి. తద్వారా కంపెనీకున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ), కోర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీ (సీఐసీ) ట్యాగ్‌లను తొలగించుకునేందుకు అవకాశం లభిస్తుందని ట్రస్ట్‌లు భావిస్తున్నాయి. 

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లు 66 శాతం వాటా కలిగి ఉన్నాయి. ట్రస్ట్‌లు ఈ కంపెనీ లిస్టింగ్‌ను వ్యతిరేస్తున్నాయి. కానీ, ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ షేర్లను మార్కె ట్లో నమోదు చేయాలని టాటా సన్స్‌ బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. కంపెనీ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ పునర్నియామకంతో పాటు లిస్టింగ్‌ విషయంలో టాటా సన్స్‌ బోర్డు, టాటా ట్రస్ట్‌ల మధ్య ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది.

టాటా సన్స్‌ లిస్టింగ్‌కు టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌ నోయల్‌ టాటా ఏమాత్రం సుముఖంగా లేరు. ట్రస్ట్‌ల దాతృత్వ కార్యక్రమాలకు లిస్టింగ్‌ అవాంతరంగా మారవచ్చన్నది ఆయన వాదన. కానీ, షేర్ల లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ తన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ) లైసెన్సు రద్దు కోసం 2024 మార్చిలో సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. 

దాంతో కంపెనీకి లిస్టింగ్‌ తప్పనిసరిగా మారింది. తాజా ప్రతిపాదన ప్రకారం.. టాటా సన్స్‌లో రెండు కంపెనీల విలీనానికి కూడా ఆర్‌బీఐ ముందస్తు అనుమతి తప్పనిసరి. విలీన ప్రతిపాదనను పరిగణించి, ఆర్‌బీఐ అనుమతి పొందాల్సిందిగా టాటా సన్స్‌ బోర్డును ట్రస్ట్‌లు కోరాయి.

ఇదిలా ఉండగా, టాటా సన్స్‌లో సుమారు 18.4 శాతం వాటా ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ లిస్టింగ్‌కు మద్దతు ఇస్తోంది. తన వాటాలో కొంత భాగాన్ని మానిటైజ్ చేయడానికి కనీసం రూ.25,000 కోట్ల విలువైన లావాదేవీ ప్రతిపాదనను కూడా టాటా ట్రస్ట్స్ బోర్డు ముందు ఉంచింది. ప్రస్తుతం టాటా ట్రస్ట్స్ ప్రతిపాదనపై బోర్డు, నియంత్రణ సంస్థల నిర్ణయాలు కీలకం. ఐపిఓ  జరుగుతుందా, లేక పునర్వ్యవస్థీకరణ ద్వారా టాటా సన్స్ అన్‌లిస్టెడ్‌గా కొనసాగుతుందా అనేది ఇంకా తేలలేదు.

About The Author