రకుల్ కుటుంబ సభ్యుల ఆఫీసుల్లో ఆదాయపన్ను సోదాలు 

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. పన్ను ఎగవేత, సినిమాల పేరుతో విదేశాలకు నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ముంబై ఐటీ విభాగం ఒకేసారి పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది.

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆమె భర్త జాకీ భగ్నానీ, మామ వషు భగ్నానీకి సంబంధించిన కార్యాలయాల్లోనూ ముంబయి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, పనోరమా స్టూడియోస్ కు సంబంధించిన 15 ప్రదేశాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం.

పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ అత్తంటి వారిపై ఐటీ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్, నిర్మాణ పనుల పేరుతో భారీ మొత్తంలో డబ్బును అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖకు పలుమార్లు సమాచారం అందినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్ధిక రికార్డులు, విదేశీ లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

బాలీవుడ్‌ నిర్మాత వాషు భగ్నానీ కుమారుడు, నిర్మాత జాకీ భగ్నానీని రకుల్‌ ప్రీత్‌ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2024లో వీరి వివాహం జరిగింది. ‘పనోరమా స్టూడియోస్’ బ్యానర్‌పై ‘కూలీ నెం.1’ ‘హీరో నెం.1’ ‘బీవీ నెం.1’, ‘దృశ్యం’, ‘రెహనా హై తేరే దిల్ మే’, ‘మిషన్ రాణిగంజ్’ వంటి ఎన్నో చిత్రాలను వాషు నిర్మించారు. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలనుజాకీ భగ్నానీ చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించడం లేదు.

ఈ లావాదేవీల్లో పెద్ద ఎత్తున పన్నుల అవకతవకలు, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తోన్నాయి.  నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయడానికి ముంబై ఐటీ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆమె వ్యక్తిగత వ్యాపారాలు, సినిమాలకు తీసుకుంటున్న పారితోషికాలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన వివిధ బ్యాంక్ ఖాతాల డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.  

చలనచిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం సాగే విదేశీ పంపిణీ, ప్రొడక్షన్ వ్యవహారాలలో పన్నులు ఎగ్గొట్టేందుకు చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకున్నట్లు అనేక ఫిర్యాదులు అందాయి.  

About The Author