కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా తీర్మానం వద్దని వారించిన ఉన్నతాధికారులు!

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు, ఆ అంశం న్యాయస్థానం పరిశీలనలోఉందని, కాబట్టి ఆ తీర్మానాన్ని చేపట్టకూడదని పేర్కొంటూ ఉన్నతాధికారుల నుండి అసెంబ్లీ స్పీకర్‌కు ఒక అసాధారణ లేఖ అందింది.  ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మూడు రోజుల తర్వాత, జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ అటల్ డులూ , లా సెక్రటరీ అచల్ సేథీలు ఆ తీర్మానాన్ని అనుమతించవద్దని కోరుతూ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు వేర్వేరు లేఖలు పంపారు. 
 
అసెంబ్లీ పనితీరులో బ్యూరోక్రసీ (అధికార యంత్రాంగం) ఇలా జోక్యం చేసుకోవడానికి ఎటువంటి పూర్వాపరాలూ లేవని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ విస్మయం వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రి ఆమోదం లేకుండా అసెంబ్లీ సెక్రటేరియట్‌కు లేఖ పంపడం సభను బలహీనపరిచే స్పష్టమైన ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.   “సభ కార్యకలాపాలను అడ్డుకోవడానికి బ్యూరోక్రసీ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు లేఖ రాయడం వంటి ఉదాహరణలు ఎప్పుడూ లేవని నేను భావిస్తున్నాను. పైగా, సంబంధిత మంత్రి ఆమోదం లేకుండా ఇలా చేయడం జరిగింది,” అని ఆయన తెలిపారు. 
 
న్యాయ శాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఒమర్ అబ్దుల్లా, అధికారులు పంపిన లేఖ గురించి అసెంబ్లీ సెక్రటేరియట్ తనకు సమాచారం ఇచ్చే వరకు తనకు ఏమీ తెలియదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేకపోవడం వల్లే ఇలాంటి లేఖ వచ్చిందని ఆయన తెలిపారు. 
 
బిజెపి సభ్యులు సభ నుండి వాకౌట్ చేసిన సమయంలో రాష్ట్ర హోదా తీర్మానంపై మాట్లాడుతూ, ఆమోదం లేని ఆ లేఖలు బ్యూరోక్రసీని వేరొకరు నియంత్రిస్తున్నారని స్పష్టంగా చూపిస్తున్నాయని అబ్దుల్లా ఆరోపించారు. “స్పీకర్ గారూ, నేను న్యాయ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కూడా, కానీ నా తీర్మానంపై బ్యూరోక్రసీ మీకు ఒక అభిప్రాయాన్ని పంపడం గురించి నాకు ఏమీ తెలియదు. ఎవరి ఆదేశాల మేరకు అది పంపబడిందో కూడా నాకు తెలియదు,” అని అబ్దుల్లా స్పష్టం చేశారు. 
 
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదాను తొలగించిన తర్వాత ప్రజలు “అవమానానికి” గురయ్యారని, రాష్ట్ర హోదా పునరుద్ధరణను కోరడం తమ హక్కు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే, సొంత అధికార యంత్రాంగమే దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఏ రాష్ట్రంలోనైనా జరుగుతుందా? ఇది కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే సాధ్యం. ఇది అక్కడి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది,” అని అబ్దుల్లా తెలిపారు.

 

About The Author