తెలంగాణ సచివాలయంలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో నిరసన తెలిపారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, ఆర్థిక శాఖ కార్యదర్శిని సందీప్‌కుమార్ సుల్తానియాను కలవడానికి అధికారులు అనుమతించడం లేదని వారు మండిపడ్డారు. వెంటనే ఉప ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పించాలంటూ భట్టి ఛాంబర్ వైపు వారు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర నెట్టివేత, వాగ్వాదం చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి సర్వీస్ చేసి రిటైర్ అయినప్పటికీ తమకు రావాల్సిన బెనిఫిట్స్, బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడం దారుణమని రిటైర్డ్ ఉద్యోగులు వాపోయారు. అలాగే పనులు పూర్తి చేసిన తమకు బిల్లులు రాక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని కాంట్రాక్టర్లు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు సుమారుగా రూ.7 వేల కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిసింది. ఇక, చిన్న కాంట్రాక్టర్‌లకు మరో రూ. 8వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాల్సి ఉందని, మొత్తంగా ప్రభుత్వం కాంట్రాక్టర్‌లకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయిస్‌లకు కలిపి సుమారుగా రూ.45 వేల కోట్ల వరకు పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్టుగా సమాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భట్టి విక్రమార్క చాంబర్‌ను ముట్టడించటం ఇది మూడోసారి. బాధితులు సచివాలయం లోపలికి వచ్చి మరీ ఆర్థిక మంత్రి కార్యాలయం ఎదుట బైఠాయించడం కలకలం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలు, మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టి ఏండ్లు గడుస్తున్నా బిల్లులు అందకపోవడంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని చిరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేశారు.
పనులు పూర్తి చేసి ట్రెజరీల చుట్టూ తిరుగుతున్నా కేవలం టోకెన్ నంబర్లే ఇస్తున్నారని, ఖాతాల్లో మాత్రం పైసలు జమ కావడం లేదని మండిపడ్డారు. అప్పులపాలై, ఫైనాన్షియర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. మరోవైపు సర్వీస్ ముగిసిన తర్వాత తమకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, కమ్యూటేషన్ వంటి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ అందకపోవడంతో వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

More Stories
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం
రూ. 1.20 లక్షల కోట్ల ఎస్సీ నిధులపై శ్వేతపత్రం ప్రకటించండి
నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు.. 9 మంది అడ్మిషన్లు రద్దు!