రూ. 1.20 లక్షల కోట్ల ఎస్సీ నిధులపై శ్వేతపత్రం ప్రకటించండి

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కాగితాలపై అంకెల గారడీతో దళిత సమాజాన్ని మోసం చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ విమర్శించారు.   గడచిన 2024, 2025, 2026 ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్  కింద వార్షిక బడ్జెట్లలో ఏటా దాదాపు రూ. 40,000 కోట్ల చొప్పున మొత్తం రూ. 1,20,000 కోట్లు కేటాయించామని అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గొప్పలు చెప్పుకున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఖర్చు చేసింది మాత్రం శూన్యమని విమర్శించారు.

ఎస్సీ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? ఎంతమంది దళిత యువతకు స్వయం ఉపాధి లబ్ధి చేకూరిందో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను, హైదరాబాద్ కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముట్టడించి, అధికారులను, పాలకులను సూటిగా నిలదీస్తామని కాంతికిరణ్ వెల్లడించారు.

 
ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారిమళ్లించి, నిరుద్యోగ దళిత యువతకు తీరని అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని కాంతికిరణ్ ఎండగట్టారు.  పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొద్దిమంది యువకులకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం దళిత యువత జీవితాల్లో వెలుగులు నింపుతోందంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు.  మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం సబ్సిడీలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆరోపించారు.
 
కేవలం ఎస్సీ కార్పొరేషన్ కేటాయింపులనే పరిశీలిస్తే, మూడేళ్లలో రూ. 7,000 కోట్ల నుంచి రూ. 8,000 కోట్లు చూపిస్తూ ఒక్క పైసా కూడా నిరుద్యోగ యువతకు చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో దళిత కుటుంబాలకు రూ. 12 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు.

రాజీవ్ యువ వికాసం పేరిట దళిత యువత స్వయం ఉపాధి కోసం సుమారు 5 లక్షల దరఖాస్తులను స్వీకరించి, ఇప్పటివరకు ఒక్క దరఖాస్తును కూడా ఆమోదించకుండా, గ్రౌండింగ్ చేయకుండా యువతను దారుణంగా మోసం చేశారని కాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎస్సీల సంక్షేమం కోసం కేటాయించిన కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎన్నికల అవసరాల కోసం మళ్లిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు.

About The Author