అలరించిన సంప్రదాయ కూచిపూడి నృత్యం, హరికథ కళారూపాలు

దృశ్య వేదిక సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించిన సంప్రదాయ కళారూపాలైన కూచిపూడి నృత్యం, హరికథ కార్యక్రమాలు అందరిని అలరించాయి.  శ్రీ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రముఖ నాట్య గురువు గొనుగుంట శైలశ్రీ శిష్యులు ఎం. లావణ్య, వి. దుర్గ కావ్యశ్రీ, డి. కాత్యాయని, టి. చంద్రవర్షిణి, ఎ. తన్మయి, కె. రత్న శైలజ, ఎ. జస్విత, పి. అసికా, జోషిత నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘ఝం ఝం గణేశా’, ‘గంగోద్భవం’ అనే రెండు నృత్యాంశాలను ప్రదర్శించారు.  ముఖ్యంగా ‘గంగోద్భవం’ను వినూత్న భావనతో రూపొందించి ప్రదర్శించడం విశేషంగా ఆకట్టుకుంది.  నర్తకుల సమన్వయం, అభినయం, హావభావాలు, లయబద్ధమైన నృత్య విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. 
ఆ తర్వాత  ప్రముఖ హరికథా కళాకారుడు ముప్పవరపు సింహాచల శాస్త్రి హరికథను ప్రదర్శించారు.  ఆయన భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. రాష్ట్ర ప్రభుత్వం, పలు సాంస్కృతిక సంస్థల నుంచి కూడా ఆయన అనేక సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. హరికథ అనేది కథాగానం, సంగీతం, నృత్యం, సాహిత్యం, అభినయం వంటి పలు కళారూపాల సమ్మేళనమైన విశిష్ట సంప్రదాయ కళారూపం. సింహాచల శాస్త్రి ‘భక్త పోతన’ కథను తనదైన శైలిలో వినిపించారు.

సందర్భానుసారంగా చమత్కారంగా స్పందించే ఆయన స్వభావం, భాషపై ఉన్న పట్టు, ఆకట్టుకునే కథనశైలి హరికథకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతన భక్తి, సాహిత్య ప్రతిభ, ఆధ్యాత్మిక భావనలను ఆయన తన కథనంలో చక్కగా ఆవిష్కరించారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఆలకించారు. ఈ హరికథకు పాలపర్తి నాగేశ్వరరావు వయోలిన్‌పై, కె. అమిల్‌కుమార్ మృదంగంపై సహకరించారు.

కార్యక్రమం అనంతరం దృశ్య వేదిక అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ నృత్య కళాకారులతో పాటు హరికథా కళాకారులను సత్కరించారు.
హిమసాగర చంద్ర మూర్తి, పద్మశ్రీ, నరేన్ బొర్రా, వెనిగళ్ల భాస్కర్, ఎల్‌ఎస్‌ఆర్‌కే ప్రసాద్, అనిల్ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. గొనుగుంట సత్యనందిని కార్యక్రమాన్ని సమర్థవంతంగా వ్యాఖ్యాతగా నిర్వహించారు.

 

About The Author