వంట నూనెలపై దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని వంట నూనె కంపెనీలను ఆదేశించింది. పండుగ సీజన్‌కు ముందే దేశీయంగా వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగి, దేశంలో ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయి.
ఈ నేపథ్యంలో సుంకాల తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు అందేలా చూడాలని వంట నూనె సంఘాలు, పరిశ్రమ వర్గాలకు సూచనలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులపై భారం తగ్గించడంతో పాటు రైతులు, పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వంట నూనెల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇందులో భాగంగా ముడి, శుద్ధి చేసిన పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై దిగుమతి సుంకాలను సవరిస్తూ పలు రకాల నూనెలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించింది. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ముడి పొద్దుతిరుగుడు నూనెపై ఉన్న 10 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించి సున్నాకు తీసుకొచ్చారు.
ఇక శుద్ధి చేసిన పామాయిల్, సోయాబీన్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 32.5 శాతం నుంచి 27.5 శాతానికి, శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనెపై సుంకాన్ని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి కుదించారు. కేంద్రం జారీ చేసిన కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం సవరించిన ఈ దిగుమతి సుంకాలు సెప్టెంబర్ 24 నుంచే అమల్లోకి వచ్చాయి. గత ఏడాది కాలంలో భారతదేశంలో కూరగాయల నూనెల ధరలు దాదాపు 20 శాతం వరకు పెరిగాయి.
భారత్ తన అవసరాలకు కావలసిన పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలను ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజా సుంకాల తగ్గింపుతో ముడి వస్తువుల దిగుమతి భారం తగ్గి, పండుగ వేళ దేశీయ వినియోగదారులకు ధరల భారం నుంచి పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

More Stories
మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
మొబైల్ వాడకందారులకు డేటా లేకుండా సిమ్ రీచార్జ్!
ఎండీఆర్ అంటే సెస్, పన్ను కాదు.. ప్రజలపై భారం ఉండదు